Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ఈడీ వాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజల్ని పీల్చి పిప్పి చేసే నిర్వాహకులు, వాటికి ఆర్థిక చేయూత ఇచ్చే వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం హైకోర్టును కోరింది. క్యూడోస్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ పవిత్ర ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ అరెస్ట్ చేస్తే కింది కోర్టు రిమాండ్‌కు తరలించింది. దీంతో వాల్వేకర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ రిట్‌ను జస్టిస్ కె.లలిత విచారించారు. ఈడీ వాదిస్తూ, రోగ్ లోన్ యాప్స్ కేసు, మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ పెట్టిన కేసులో పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. నాన్‌బ్యాకింగ్ కంపెనీలు రూ.10 కోట్లు మాత్రమే టర్నోవర్ చేయాల్సివుండగా రూ.2 వేల కోట్లు రుణాలు ఇచ్చారనీ, 36 శాతం వడ్డీ, ఇతర చార్జీలు, రెండు వారాలకు మించకుండా రుణం ఇచ్చి దోపిడీ చేస్తున్నారని చెప్పింది. అతి తక్కువ కాలంలో రూ.550 కోట్లు లాభం పొందడాన్ని బట్టి లోన్ యాప్‌లు ఎంతగా దోచుకున్నాయో స్పష్టమవుతోందని చెప్పింది. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
స్టే ఉత్తర్వులు రద్దు
హైదరాబాద్ సిటీలోని హకీంపేటలో ఆర్టీసీ నడుపుతున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్‌ను నిర్వహించే కాంట్రాక్టర్ తొలగింపు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఇచ్చిన స్టే ఆదేశాలను హైకోర్టు గురువారం రద్దు చేసింది. కాంట్రాక్టర్ ఎం.నెహ్రూకు నోటీసునిచ్చి సహజ న్యాయ సూత్రాలను అమలు చేశామని ఆర్టీసీ చెప్పింది. కుట్రతోనే తనను తొలగించారని నెహ్రూ కోర్టుకు వివరించారు.