Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణతంత్ర వేడుకల్లో కలంకారీ చేతి పెయింటింగ్ ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో కలంకారీ చేతి పెయింటింగ్‌ను ఆయన ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కలంకారీ కళ స్క్రోల్‌పై ఉంటుందని తెలిపింది. ఇది సహజమైన రంగులను ఉపయోగించి వెదురు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్‌పై చిత్రించే చేసే చేతి పెయింటింగ్ పురాతన శైలి అని వివరించింది. ఈ సందర్భంగా రాజ్‌పథ్ ఓపెన్ గ్యాలరీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శిస్తుందని ప్రకటించింది. వీటి పొడవు ఒక్కొక్కటీ 750 మీటర్లు ఉంటుందని తెలిపింది. భారతదేశం అంతటా ఉన్న 500 మందికిపైగా కళాకారులు దీన్ని చిత్రించారని పేర్కొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శనకు ఎంపికైన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం ఉందని తెలిపింది.