Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా నెట్వర్క్
- డొంక కదిలించిన టాస్క్ఫోర్సు పోలీసులు
- ముంబయి, పూణే పోలీసుల సహకారంతో నిందితుడి అరెస్ట్
- డ్రగ్స్‌ను సంపన్నులే అధికంగా వినియోగిస్తున్నారు : సీపీ
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఎట్టకేలకు టాస్క్ఫోర్సు పోలీసులు డ్రగ్స్ డాన్ టోనీని అరెస్టు చేశారు. ముంబయిలో మకాం వేసిన అతను దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. నిందితుడు టోనీతోపాటు, డ్రగ్స్ వినియోగిస్తున్న మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. టోనీ నుంచి 10 గ్రాముల కొకైన్, కారు, రెండు సెల్ఫోన్లు, డ్రగ్స్ వినియోగదారుల నుంచి 9 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నైజీరియాకు చెందిన చుకో ఓగ్బోన్నా డేవిడ్ అలియాస్ టోనీ పదో తరగతి వరకు చదువుకున్నాడు. గార్మెంట్ వ్యాపారం పేరుతో 2013లో ఇండియాకు వచ్చిన నిందితుడు వీసా గడువు తీరినా ముంబయిలో అక్రమంగా ఉంటున్నాడు. స్నేహితుల సలహాతో డ్రగ్స్ సరఫరాకు తెరలేపాడు. ముంబయి, మహారాష్ట్ర, బెంగళూరు, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. నైజీరియాలో నివాసముంటున్న డ్రగ్స్ మాఫియా స్టార్బారు నుంచి టోనీ డ్రగ్స్ కొనుగోలు చేసి, అక్కడి నుంచి షిప్‌లలో ముంబయికి తెప్పిస్తున్నాడు. ఆ తర్వాత దేేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. అయితే, ప్రధాన నిందితుడు ఇమ్రాన్ బాబుషేక్ను కొద్ది రోజుల కిందట హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిచ్చిన సమాచారంతో ముంబయికి వెళ్లిన నార్త్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు టోనీని అరెస్టు చేశారు. అతని నుంచి డ్రగ్స్ కోనుగోలు చేసిన వారిని గుర్తించి, 9 మందిని బడా వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా వ్యాపారవేత్తలు తమ కార్యాలయంలో పనిచేసే ఆఫీస్ బార్సు సెల్ఫోన్లను వినియోగించారు. వాయిస్ కాల్స్‌లో మాట్లాడేవారు. నాలుగైదు ఏండ్ల నుంచి టోనీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. అతను నేరుగా ఎవరినీ కలవడు. తెరవెనుక నుంచి నడిపిస్తుంటాడు. నైజీరియాకు చెందిన సిమ్, సెల్‌ఫోన్‌ను టోనీ ఉపయోగిస్తున్నాడు. ఆన్లైన్లో వ్యాపారం ఎక్కువగా చేస్తాడు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో సంపన్నులే ఉంటున్నారు. డ్రగ్స్ సరఫరాదా రులు, వినియోగదారులు, కోనుగోలు దారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సీపీ స్పష్టం చేశారు. హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్ కుమార్, బంజారాహిల్స్‌కు చెందిన శశ్వత్ జైన్, గౌలిపురాకు చెందిన యజ్ఞానంద్ అగర్వాల్, బంజా రాహిల్స్కు చెందిన దండు సూర్యాసుమిత్రెడ్డి, టి.సాగర్, ఎర్రగడ్డకు చెందిన బండి భార్గవ్, జూబ్లీ హిల్స్‌కు చెందిన వెంకట్ చలసాని, రాజేంద్రనగర్‌కు చెందిన (ఆఫీస్బారు) అల్గానీ శ్రీకాంత్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రయివేట్ ఉద్యోగి గోడి సుబ్బారావును పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో వందల కోట్ల వ్యాపారాలు చేసేవారున్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వర్రావు, పంజాగుట్ట ఎస్‌హెచ్‌వో నిరంజన్ రెడ్డితోపాటు టాస్క్ఫోర్సు, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.