Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలుమగలను వేరుచేస్తున్న 317 జీవోపై నిరసనలు
- ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఈ ఫొటోలోని ఉపాధ్యాయ దంపతుల పేర్లు నాగూర్‌వలీ, షేక్ హసీనాబేగం. వీరిలో నాగూర్వలీది మధిర మండలంలోని ఓ గ్రామం. హసీనాది కృష్ణా జిల్లా. 2002 డీిఎస్సీలో ఆమె ఎస్జీటీగా ఎంపికయ్యారు. మధిర మండలంలో సోషల్ స్కూల్ అసిస్టెంట్‌గా చేస్తున్న తన భర్త దగ్గర ఉండాలనే ఉద్దేశంతో 11 ఏండ్ల సర్వీసు వదులుకుని ఆమె కృష్ణా జిల్లా నుంచి మధిరకు వచ్చారు. నాగూరువలీ మధిర మండలం మడుపల్లి హైస్కూల్ పనిచేస్తున్నారు. హసీనా దెందుకూరు అర్జునవాడ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. అంతర్ రాష్ట్ర బదిలీకి ముందు వారిద్దరు ఐదారు కి.మీ దూరంలోని స్కూళ్లలో పనిచేసేవారు. 317 జీవోతో సీనియార్టీ కోల్పోయిన హసీనాను ఇప్పుడు ఏకంగా 220 కి.మీ దూరంలో 14 మంది విద్యార్థులున్న సింగిల్ టీచర్ స్కూల్‌కు కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగుళ్ల గ్రామంలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలు, భర్తను వదిలి హసీన 220 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారికి అప్పీల్ చేసుకున్నారు. జీవో 317తో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భార్యభర్తలను వేరుచేస్తూ చేరో జిల్లాకు కేటాయించడంపై నిరసనలు మిన్నంటుతున్నాయి. అయినా ప్రభుత్వం తీరులో మార్పు రాకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ జీవోను సవరించి బాధితులకు న్యాయం చేయాలని, భార్యాభర్తలను ఒకే జిల్లాలో కొనసాగించాలని, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలనే తదితర డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోకుండా జోనల్ విధానం అమలు కోసం విడుదల చేసిన 317 జీవోను యథాతథంగా కొనసాగిస్తోంది. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశాఖలోనే 164 స్పౌజ్ కేసు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త జిల్లాలకు కేటాయించినా ఆ జిల్లాలో పట్టణ ప్రాంతాలకు సమీపంలోని పాఠశాలలనూ బ్లాక్ చేశారనే ఆరోపణ ఉంది. ఫలితంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాల్లోనే భార్యభర్తలకు ఒకే జిల్లాలో పోస్టులు ఇచ్చారు. మిగతా 13 జిల్లాల్లో పోస్టులు బ్లాక్ చేసి, దంపతులను వేర్వేరు ప్రాంతాలకు పంపారు. ఇటీవల ఈ 13 జిల్లాల స్పౌజ్ బాధితులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. భార్యకు గద్వాల జిల్లాలో భర్తకు రంగారెడ్డి, భర్తకు రంగారెడ్డిలో భార్యకు యాదాద్రి, భార్యకు ఖమ్మం జిల్లాలో భర్తకు ములుగు, భర్తకు భద్రాద్రి జిల్లాలో భార్యకు ఖమ్మం జిల్లాలో, లేదంటే మహబూబాబాద్‌లో ఇలా ఇష్టానుసారంగా కేటాయించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపులు జరపడం వల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని టీచర్స్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అంతరాష్ట్ర బదిలీల్లో భాగంగా సర్వీసును కోల్పోయి మరీ స్పౌజ్‌గా వచ్చిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భార్యభర్తలు ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో ఏపీ నుంచి సర్వీసు వదులుకుని తెలంగాణలోని వివిధ జిల్లాలకు 2013లో అంతర్ రాష్ట్ర బదిలీల్లో భాగంగా వచ్చిన వందలాది టీచర్లు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో 317 జీవోపై సుమారు 8000 అభ్యంతరాలు రాగా దీనిలో 5000 వరకు స్పౌజ్ కేసులకు సంబంధించినవే ఉన్నాయని తెలిసింది. వీటిలో భర్త లేదా భార్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కేసులు ఓ 1,500 వరకు ఉన్నట్టు సమాచారం.
ఆలుమగల అవస్థలు
2013 సంవత్సరంలో అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వీరిలో 90శాతం వరకు దంపతులు ఉన్నారు. సర్వీసు వదులుకుని మరీ స్పౌజ్ బదిలీల్లో భాగంగా భార్య దగ్గరకు భర్త, భర్త దగ్గరకు భార్య చేరారు. నాటి నుంచి ఇద్దరూ ఒకే చోట ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పది, ఇరువయ్యేళ్ల సర్వీసు వదులుకున్నవారు సైతం ఉన్నారు. అంతరాష్ట్ర బదిలీకి ముందు తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో విధులు నిర్వహించినప్పుడు వీరి మధ్య గరిష్టంగా 50 కి.మీ దూరం ఉండేది. 317 జీవోతో ఇప్పుడు 200 కి.మీ దూరం పెరిగింది. సర్వీసు వదలుకుని స్పౌజ్పై వస్తే ఉపయోగమేంటని ఇప్పుడా ఉద్యోగులంతా మదనపడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి వెలువడిన ఆదేశాల మేరకు బయట జిల్లాలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన భార్యాభర్తల నుంచి, వెళ్ళేందుకు అంగీకరించని దంపతుల నుంచి డీఈవో కార్యాలయాలలో కొద్దిరోజులుగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే అందరూ ఊహించినట్లుగా అధికారికంగా ప్రభుత్వం గురువారం స్పౌజ్ కేసులపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.