Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి: సీసీఐ సాధన కమిటీ డిమాండ్
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెరిపించే వరకు పోరాటం ఆపేదిలేదని సీసీఐ సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ పరిశ్రమను తెరిపించాలని కేంద్రమంత్రిని కలిసినట్టు వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం కలిశారని గుర్తుచేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రావడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఈ పరిశ్రమను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇటీవల రాష్ట్ర మంత్రి కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఈ పరిశ్రమ తెరిపిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇవ్వడంతో ప్రజలు ఎంపీని గెలిపించారని గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీని పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం ఈ పరిశ్రమ కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ మాట్లాడుతూ.. ఈ పరిశ్రమను తెరిపించేందుకు సీపీఐ(ఎం) పార్టీ అనేక పోరాటాలు నిర్వహించినట్టు తెలిపారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం కేంద్ర ప్రభుత్వానికి పరిశ్రమను తెరిపించాలని లేఖ రాసినట్టు గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుని వెంటనే రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అనేక మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ పరిశ్రమను తెరిపించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నటరాజ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సాధన కమిటీ కో కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, మునిగెల నర్సింగ్, నంది రామయ్య, కొండ రమేష్, సభ్యులు లంకరాఘవులు, బండి దత్తాత్రి, సామ రూపేశ్ రెడ్డి, తోట కపిల్ పాల్గొన్నారు.