Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదారాబాద్
గ్రూప్-1,2,3,4 సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులు 1600 ఖాళీగా ఉన్నాయనీ, పదేండ్లుగా ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఫలితంగా ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇన్చార్జిగా కొనసాగుతున్నారని తెలిపారు. గ్రూప్-2 పోస్టులు రెండు వేలు, గ్రూప్ -3 పోస్టులు రెండు వేలు, గ్రూప్ -4 పోస్టులు నాలుగువేలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వేలాది గ్రూప్ పోస్టుల ఖాళీగా ఉండటంతో పాలన నత్తనడకన నడుస్తున్నదని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసుల్లో 25 ఏండ్లుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామనీ, ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.