Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన ఊరు-మనబడి' చదువును అభివృద్ధిచేసేలా లేదు
- మూడు నెలల్లో రూ.3,497 కోట్లు ఎలా ఖర్చు చేస్తారు
- 317 జీవోను రద్దు చేయాల్సిందే ొ శాస్త్రీయంగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలి
- కేంద్రం విధానాలను నిలువరించడంలో టీఆర్ఎస్ విఫలం
- బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే కేసీఆర్ ప్రయత్నం
- 22 నుంచి సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలు
- శనివారం ఆన్లైన్లో బహిరంగసభ ొ 23 నుంచి 25 వరకు ప్రతినిధుల సభ : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది బడులు, చదువును అభివృద్ధి చేసేలా కనిపించడం లేదు. రూ.3,497 కోట్ల నిధులను కైంకర్యం చేసే కార్యక్రమంలా ఉన్నది. ప్రస్తుత విద్యాసంవత్సరం మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ తక్కువ సమయంలో రూ.3,497 కోట్లు ఖర్చు చేయడం అంత సులువు కాదు. పాలకులకు ఇష్టమైన కాంట్రాక్టర్లకు పనులిచ్చి ఆ నిధులను భోంచేయడం తప్ప మరొకటి కాదు. అలా కాకుండా పారదర్శకంగా విద్యాకమిటీల ఆధ్వర్యంలో బడుల అభివృద్ధి పనులు జరగాలి'అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్, టి జ్యోతి, నంద్యాల నర్సింహ్మారెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలు ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయని తమ్మినేని ఈ సందర్భంగా చెప్పారు. తొలిరోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్లో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, బృందాకరత్, తనతోపాటు టి జ్యోతి ప్రసంగిస్తారని వివరించారు. ఈనెల 23 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో ప్రతినిధుల సభ జరుగుతుందని వివరించారు.
స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించాలి
ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్న జీవోనెంబర్ 317ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు. ఈ జీవో అశాస్త్రీయంగా ఉందని విమ ర్శించారు. ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానికతను కోల్పోయి ఇతర జిల్లా, జోన్లు, మల్టీ జోన్లకు శాశ్వతంగా బదిలీ అయిన ఉద్యోగుల కోసం అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలనీ, సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సీనియార్టీపై అప్పీళ్లు, సామాజిక తరగతులకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు. నిషేధం విధించిన 13 జిల్లాల్లో స్పౌజ్ కేసులను పరిష్కరించాలనీ, ఉద్యోగులు కోరుకున్న పద్ధతిలోనే అనుమతించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల స్పౌజ్‌లు, వితంతువులు, ఒంటరి మహిళలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్నారు. ఇదే పద్ధతి ప్రభుత్వ ఉద్యోగులకూ వర్తింపచేయాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చించకపోవడం వల్ల ఇప్పటికే టీచర్లు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.
ఇంగ్లీష్ మీడియంపై సమగ్రంగా చర్చించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పేద, సామాజిక వర్గాలకు ఉపయోగకరమే అయినా తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేస్తే నష్టం జరుగుతుందని తమ్మినేని అన్నారు. మాతృభాషను విస్మరించొద్దనీ, తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలని కోరారు. తెలుగు మీడియంలో చదవాలనుకునే విద్యార్థులకు అవకాశం ఉండాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియం పేరుతో మాతృభాషను పూర్తిగా ఎత్తివేస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఆంగ్ల మాధ్యమం తరగతుల నిర్వహణకు పాఠశాలల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియం బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. హడావుడిగా ప్రారంభించడం కాకుండా సమగ్రంగా చర్చించి అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలతో చర్చించాలని చెప్పారు.
ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం
తెలంగాణ సాధనలో ప్రజలు ఏ ఆకాంక్షల కోసం ఉద్యమించారో, వాటిని నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తమ్మినేని విమర్శించారు. ఏడేండ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదనీ, సాగు భూములన్నింటికీ నీళ్లివ్వలేదనీ, ఆర్థిక స్వావలంబన సాధ్యం కాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణకు నీళ్లివ్వలేదని చెప్పారు. ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన జరగలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రం నుంచి ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందన్నారు. రూ.50 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని వివరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నా కేంద్రంలోని బీజేపీ విధానాలను నిలువరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ కలిపి ఆ పార్టీని ఓడించడంపై కాకుండా ఆ ఓట్లను చీల్చడంపై కేసీఆర్ దృష్టిసారించినట్టు అర్థమవుతున్నదని చెప్పారు. అందులో భాగంగానే స్టాలిన్‌ను కలిశారనీ, తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారని గుర్తు చేశారు. ఇది బీజేపీకి సాయం చేయడమే అవుతుందన్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల సంఘటన లేకున్నా మిగతా పార్టీలను ఏకం చేసి బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వివరించారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటనను నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ కార్యక్రమంతో ప్రజల ముందుకెళ్తామని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే కార్యాచరణను మహాసభలో రూపొందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్రముప్పు అంటూ వచ్చిన ప్రచారం పొలిటికల్ స్టంట్ అని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సరం పంటనష్టం తీవ్రంగా జరిగిందన్నారు. వరి, మిర్చి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టం గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, పంటనష్టపరిహారం, బీమా పథకాలంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నదని విమర్శించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పంటనష్టం తీవ్రంగా ఉందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.