Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా సర్వేల్లోనే.. పనులు
- కేటాయింపుల్లో నిధులు.. సౌకర్యాలు నిల్
- సీడీపీ నిధుల పేరుతో ప్రచారానికే పరిమితం
- కొత్తగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపు
- ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలెన్నో..
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మౌలిక సదుపాయాలే కొరవడ్డాయి. శిథిల భవనాలు, అరకొర వసతులున్న గదులు, పెచ్చులూడుతున్న పైకప్పులు, నిర్వహణ లేక కంపుకొడుతున్న మరుగుదొడ్లు, చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంగణాలు, దుర్గంధం నడుమే విద్యార్థుల మూత్ర విస్తర్జన.. ఇలాంటి చోట్ల అమ్మాయిల అవస్థలు వర్ణనాతీతం.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రతి యేటా విద్యాసంవత్సరం ప్రారంభంలో బడుల్లో వసతుల కల్పనపై సర్వే చేసి హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. పనులు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా నిధులు కేటాయింపునకు క్యాబినెట్ నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా.. అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించి బడి అభివృద్ధికి బాటలు వేయాలని టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 682 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 182 ఉన్నత, 8 ప్రాథమి కోన్నత, 492 ప్రాథమిక పాఠశాలలున్నాయి. అన్ని బడుల్లోనూ కనీస సదుపాయాలే కరువయ్యాయి. అయినా.. ఉన్నంతలోనే విద్యార్థులు సర్దుకుపోయి చదువుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గదులు ఉన్నచోట ఇతర సౌకర్యాలు లేవు. అవి ఉన్నచోట గదుల్లేవు.. టీచర్లు లేరు. మరుగుదొడ్లు, మూత్రశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నది. చాలా చోట్ల ఆర్వో ప్లాంట్స్ పనిచేయడం లేదు.
సర్వేలు.. ప్రచార ఆర్భాటాలే..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వేలు చేపడుతున్నారు. వాటి పరిష్కారం దిశగా మాత్రం చర్యలు కొరవడుతున్నాయి. గతేడాది జులైలో విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఐఎస్(స్కూల్ ఇన్ఫ్రా స్టేటస్) సర్వే చేపట్టింది. వసతుల కల్పనకు సంబంధించిన వివరాలు ఆ యాప్‌లో నమోదు చేయించింది. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. కానీ ఈ సర్వే పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీపీ) పేరిట ఒకటి రెండు నెలలు హడావుడి చేశారు. ఈ నిధుల్లో 40శాతం అంటే ఒక్కో నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.2 కోట్ల మేర పాఠశాలల అభివృద్ధికి తప్పనిసరిగా ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ డీఈవోల నుంచి ఇప్పటికే నివేదికలు తీసుకున్నా.. పనులు మాత్రం శూన్యం. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమా వేశంలో.. ప్రయివేటు బడుల్లో ఫీజులపైనా నియంత్రణ కమిటీ ఏర్పాటుతో పాటు సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.7289 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. గతేడాది బడ్జెట్లో బడుల్లో వసతుల కల్పనకు రూ.8వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, కేటాయింపులకే పరిమితం కాకుండా ఇకనైనా సర్కారు బడిలో వసతుల కల్పనకు నిధులు వెచ్చించాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
జీజీహెచ్ఎస్ (దారుల్-షిఫా) హైస్కూల్ బహుద్దూర్‌పురా
ఈ బడి సొంత భవనంలో కొనసాగుతోంది. ఉర్దూ మీడియం, కో-ఎడ్యూకేషన్. 97 మంది విద్యార్థులు, 7 మంది టీచర్లు పనిచేస్తుండగా.. హెడ్మాస్టర్ సహా ఇద్దరు టీచర్ల అవసరముంది. తరగతి గదులు అయిదు ఉండగా.. మూడింటిలో లీకేజీలున్నాయి. ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. బడి ఆవరణ కుంగిపోయింది. పాములు, పంది కొక్కులు, కుక్కలు గదుల్లోకి వస్తున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. నాలుగు యూనిట్లు ఉండగా.. పందికొక్కులు తొవ్వడంతో పనిచేయడం లేదు. అమ్మాయిల టాయిలెట్లు అపరిశుభ్రత కారణంగా నిరుపయోగంగా మారాయి. ప్రహరీ కూలిపోవడంతో రాత్రిపూట కుక్కలు తరగతి గదుల్లోకి వస్తున్నాయి.
జీపీఎస్ కవాడిగూడ
గుండా ఈశ్వరయ్య ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో ఐదు గదులుండాల్సి ఉండగా.. మూడు గదులే ఉన్నాయి. మరో రెండు గదులు నిర్మాణంలో ఉన్నాయి. 1-5వ తరగతిలో 209 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. ఐదుగురు టీచర్లు ఉన్నారు. ఉన్నత పాఠశాల ఇక్కడే కొనసాగుతోంది. టాయిలెట్ బ్లాక్స్ తక్కువగా ఉన్నాయి. నిర్మాణం జరగుతుండటంతో చెత్తా చెదారం భారీగా పెరుకుపోయింది.
శిథిల భవనంలో ముషీరాబాద్ ఉన్నత పాఠశాల
ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల దాదాపు 50 ఏండ్ల పాత భవనం. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. జీహెచ్ఎంసీ రెండు సార్లు నోటీసులు కూడా ఇచ్చింది. 20 గదులు అవసరం ఉండగా.. 7 గదులు మాత్రమే ఉన్నాయి. హెచ్ఎం, ల్యాబ్, రెస్ట్, ఉర్దూ స్టాఫ్, పీటీఈ స్టాఫ్ రూం, స్టోర్ రూమ్స్ అవసరముంది.
జీబీహెచ్‌ఎస్ జనపాడ బాగ్ అంబర్పేట్
నాలుగు అంతస్తుల భవనం. 12 గదులు ఉన్నాయి. ఇక్కడ మరో రెండు గదులు అవసరం ఉంది. 204మంది విద్యార్థులు ఉండగా.. 11 మంది టీచర్లు ఉన్నారు. మరో ఇద్దరు కావాలి. ఆటస్థలం లేదు. పక్కనే ఉన్న ప్రభుత్వం స్థలం కేటా యిస్తే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే అవకా శం ఉందని టీచర్లు చెబుతున్నారు. పాఠశాల కాంపౌండ్ ఆవరణలో భారీ చెట్టు ఉండటంతో ప్రహరీ కూలిపోయింది. కొద్దిరోజులు గా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు.
ఆ నిర్ణయం హర్షనీయం : ఏ. శ్యామ్‌సుందర్, అధ్యక్షుడు టీఎస్‌యూటీఎఫ్- హైదరాబాద్ జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7289 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. కానీ గతంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. ఇప్పటికైనా బడుల్లో మౌలిక వసతుల కల్పనకు గట్టిచర్యలు తీసుకోవాలి. ప్రీప్రైమరీనుంచే విద్యా ర్థులకు ఇంగ్లీష్ బోధనకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి.