Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెక్కకురానివి నాలుగైదు రెట్లపైనే
- ఏమైతుందిలే అన్న అజాగ్రత్త వద్దంటున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో గురు వారం ఒక్కరోజే 4,207 కేసులు నమోదైనట్టు, ఇద్దరు చనిపోయినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధి కంగా 1,645 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 380, రంగారెడ్డి జిల్లాలో 336 మందికి కరోనా సోకింది. అంటే సగానికి(2361)పైగా ఈ మూడు జిల్లాల్లో నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో 95 శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్లే ఉన్నట్టు తెలుస్తున్నది. శుక్రవారం కరోనా నుంచి కోలుకున్నవారు 1825 మంది ఉన్నాయి. రికవరీ అయ్యే వారికంటే కొత్తగా నమోదవుతున్న కేసులు రెట్టింపు స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. నాలుగు రోజుల వ్యవధిలోనే అన్ని జిల్లాల్లోనూ రెండు నుంచి నాలుగు రెట్ల మేరకు కేసులు పెరిగాయి. గొంతులో గరగర, బాడీ పెయిన్స్, తలనొప్పి, ముక్కుకారడం, పొడి దగ్గురావడం, జ్వరం లాం టివి ప్రస్తుత వేవ్‌లో కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతు న్నారు. కొం దరిలో నాలుగైదు రోజుల పాటు ఒళ్లు నొప్పులు ఉంటున్నాయని అంటు న్నారు. జ్వరం కూడా ఒకటి రెండు రోజుల తర్వాత తగ్గిపోతోందనీ, వైరల్ లోడ్ అంతా గొంతులోనే ఉండటంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడం లేదని వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే నాలుగైదు రెట్ల కంటే ఎక్కువగా ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నది. లక్షణాలున్నా చాలా మంది పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు వెళ్లట్లేదు. ఇంట్లోనే ఉండిపోతున్నారు. కొందరు మెడికల్‌షాపుల్లో కిట్లు తెచ్చుకుని, ఇంకొందరు చిన్నచిన్న ల్యాబ్‌లలో యాంటిజెన్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా లెక్కకు రాని కేసులు చాలానే ఉంటున్నాయి. ప్రాణాప్రాయం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. ఏమైతుందిలే అని అజాగ్రత్త పడొద్దనీ, ఒమిక్రాన్ వేరియంట్ మ్యూటేషన్ అయి కొత్తరూపం దాల్చితే పెను ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.