Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు వారికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం హరీశ్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టటం ద్వారా కోవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోంఐసోలేషన్ కిట్లు ఇవ్వాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ ప్రభుత్వం నిర్వహించిన సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆ సమయంలో తమ పనితీరును నిటి ఆయోగ్ ప్రశంచిందని గుర్తుచేశారు. ''థర్డ్ వేవ్‌లో కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కన్పించడం లేదు. మరి కొంత మంది పరీక్షలకు ముందుకు రావడంలేదు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుంది. ముందు జాగ్రత్తగా శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ కిట్లు ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తాం. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశార. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సహా గ్రామ స్థాయి వరకు పంపించాం.
జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని 27వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చాం. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మించుకున్నాం. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోగలిగాం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సూచనలను ప్రజలు పాటించాలి. లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే హోంఐసోలేషన్ కిట్ పంపిస్తారు.''అని హరీష్‌రావు వివరించారు.
జ్వర సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా.. తీవ్రత తక్కువగా ఉందని వివరించారు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్, కిట్లను పంపిణీ చేస్తామని అన్నారు. కరోనా తగ్గే వరకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని బస్తీ దవాఖానాలు సేవలందిస్తాయని తెలిపారు.