Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశసంపదను అమ్మేయడమే దేశభక్తా?
- ఐక్యపోరాటాలతో కేంద్రం విధానాలను తిప్పికొట్టాలి
- సమ్మె సన్నాహక సదస్సులో కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనురిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన సమ్మె ప్రజల మేలు కోసమేనని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. సమ్మె ఆవశ్యకతను, ధరల పెరుగుదల వల్ల ఎదురవుతున్న సమస్యలను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మిక కోడ్ల వల్ల తలెత్తబోతున్న ప్రమాదాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వివరించాలని పిలుపునిచ్చారు. ఐక్యపోరాటాల ద్వారానే కేంద్రం విధానాలను తిప్పికొట్టగలుగుతామని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమ్మె సన్నాహక సదస్సును కార్మిక, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత మాట్లాడుతూ..ఢిల్లీలో 500 సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి చేపట్టిన రైతాంగ పోరు ప్రజాపోరాటం మారటంతో మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లు నుంచి కేంద్రం అనివార్యంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. కార్మిక సంఘాల ఐక్య పోరాటాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వేగతరాన్ని అడ్డుకోగలిగామన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదిగా పోరాటం జరుగుతున్నదని గుర్తుచేశారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలు, ఆందోళనలు చేయడంతో రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రయివేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. లేబర్ కోడ్లను పాస్ చేసి ఏడాదిన్నర అయినా వాటిని అమలు కాకుండా అడ్డుకోవడంలో ఐక్యపోరాటాలు కీలక పాత్ర పోషించిన తీరును వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనాను అడ్డుపెట్టుకుని కార్పొరేట్లకు అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలపై భారం మోపే చర్యలకు పూనుకున్న తీరును వివరించారు. పెట్రోల్ ఉత్పత్తులపై నాలుగేండ్లలో 8 లక్షల కోట్ల రూపాయల ఎక్సైజ్ భారాన్ని మోపగా...ఈ ఏడాది కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయలను వడ్డించిందని వివరించారు. ఈ సమయంలో కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. ప్రజలకు రాయితీలు కల్పించకపోగా భారాలు మోపిందన్నారు. సమ్మె కేవలం కార్మికుల సమస్యలపైనే కాకుండా ప్రజలందరి డిమాండ్లపై చేస్తున్నామని చెప్పారు. నిత్యావసర ధరలను నియంత్రించాలనీ, ప్రతి ఒక్కరికీ రూ.7,500 ఇవ్వాలనీ, ఉపాధి హామీ పనులను పట్టణాలకూ విస్తరింపజేయాలని సమ్మె డిమాండ్లలో పెట్టామని వివరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మికుల కోసమే కాదు..ప్రజలందరి కోసం అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి పి.విజయలక్ష్మి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీమానిటైజేషన్, నేషనల్ మానిటైజేషన్ పైపులైన్లతో దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేసిందని విమర్శించారు. మానవాభివృద్ధి సూచీలో 131వస్థానం, ప్రపంచ ఆకలి సూచికలో 101వ స్థానంలో నిలవటాన్ని చూస్తే మన దేశం పరిస్థితేంటో అర్థమవుతున్నదన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేయడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. దేశంలో పరిస్థితులు మెరుగుపడాలంటే మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కరోనా కాలంలో ఓవైపు పేదలు తిండిదొరక్క అలమటిస్తుంటే మరోవైపు దేశంలో కార్పొరేట్ల ఆస్తులు మాత్రం రెండు, మూడు రెట్లు పెరిగాయని విమర్శించారు. దోచుకున్న సంపదను పోగేసుకుంటున్న కార్పొరేట్లకు మోడీ సర్కారు అండగా నిలుస్తున్నదన్నారు. మహిళ శ్రమశక్తికి విలువనే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.21 వేలు, పెన్షన్ రూ.10 వేల కోసం గట్టిగా పోరాడాలన్నారు.
ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మోడీ సర్కారు పేదల బతుకు లను మరింత దుర్భరంగా మార్చిందని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో సమ్మె జయప్రదానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు దానకర్ణచారి మాట్లాడుతూ..బ్రిటీష్ హయాంలో పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కారు కాలరాయాలని చూస్తున్నదని విమర్శించారు. పార్టీలు, జెండాలు పక్కనబెట్టి కార్మికుల హక్కుల కోసం ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి ఐక్య పోరాటాలు చేయాలని కోరారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ.. మోడీ సర్కారు దేశానికి మూల స్తంభాలుగా ఉన్న ఎల్ఐసీ, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని చూస్తున్నదని విమర్శించారు. రక్షణ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించడం దేశభక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. అది ముమ్మాటికీ దేశద్రోహమేననీ, వారిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ బలపర్చారు. సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోసు, హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదరుభాస్కర్రావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ప్రవీణ్, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూరావు, సి.జి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.నాగేశ్వరరావు, ఎఐడిఇఎఫ్ జాయింట్ సెక్రెటరీ జి.టి.గోపాల్ రావు, పెన్షనర్స్ ఆసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం.ఎన్.రెడ్డి, టిఎంఎస్ఆర్యు రాష్ట్ర నాయకులు ఎ.నాగేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు.సదస్సుకు అధ్యక్షవర్గంగా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు విజరుకుమార్ యాదవ్, ఏఐటీయూసీ కార్యదర్శి బాలరాజ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, కోశాధికారి వంగూరు రాములు ఐఎఫ్టీయూ నేత సాంబశివుడు వ్యవహరించారు.