Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నినదించే గొంతుల్ని నొక్కేయాలి.
బిగించే పిడికిళ్లను విరిచేయాలి.
తెగించే సత్తువను అంతం చేయాలి!..
నాటి నుంచి నేటి దాకా... రాజులు, దొరలు, పెత్తందార్లు, పాలకులు ఆచరిస్తున్న పంథా ఇదే... సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది రాజ్యం. సకల సంపత్తి, ఆధునిక ఆయుధాలు అన్నీ ఉన్నా హఠాత్తుగా మీద పడింది. నిజం చెప్పాలంటే దొంగ దెబ్బతీసింది. కారణం భూమి. అవును సకల చర్యలు, ఉత్పత్తులు, పంటలు, ఫ్యాక్టరీలు వేటికైనా అవసరమైన భూమి కావాలని పేదలు పోరాడటమే అందుకు కారణం. క్రమంగా ఉధృతమవుతున్న భూపోరాటాన్ని అణిచివేసేందుకు పాలకులు ఎప్పుడైనా పగబట్టే కూసుంటారు. నాటి ప్రభుత్వమూ అంతే.. కాకుంటే ఈ అణచివేత మదపుటేనుగును మందిపైకి వదిలినట్లు, తోడేళ్లను మేకల గుంపుపైకి తోలినట్టు జరిగింది. ఫలితంగా హక్కుల కోసం ఆకాంక్షలు పొలికేకలై ఎగసిన వేళ... నెత్తురులో తడిసింది ఆ నేల.
2007 జులై 28న బలగాలమీద బలగాలు ఖమ్మం నుంచి ముదిగొండ బాట పట్టాయి. వేటకు సిద్ధమైన తోడేళ్ల తీరుగా జోరుగా వాహనాల్లో భద్రతాబలగాలు అటువైపు ఎందుకెళుతున్నాయోనని కొద్దిగా అనుమానమొచ్చినా... అక్కడ ఏం జరగుతోందనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. బారీగా బలగాలు దిగినా అదరలేదు జనం... న్యాయం కోసం గొంతెత్తినందువల్లనేమో ఎవరిలోనూ బెదురులేదు. ''పంట భూములు పంచాలి. ఇంటి జాగలు ఇవ్వాలి'' ''భూమి కావాలి- భుక్తి కావాలి'' ఇవే నినాదాలతో మార్మోగుతోంది ముదిగొండ...
అనేక ఆశలు, హామీలతో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ముసుగు క్రమంగా తొలుగుతుండటంతో... తిండిలేక, కడుపు నిండక, నీడకు లేక నిలబడే జాడలేక.. సాగు భూమి కోసం, సొంత ఇంటి కోసం, కనీసం ఇంటి స్థలాలైనా ఇవ్వాలంటూ సీపీఐ(ఎం) పోరాటం ప్రారంభించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవాలనీ, నిరుపేదలకు కనీసం నిలువ నీడైనా చూపించాలనీ పోరు దారి పట్టింది. విజ్ఞప్తులు, ఆర్జీలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు... ఇలా పలు మార్గాల్లో ఎర్రజెండాలు చేపట్టి ఆందోళనను సాగిస్తున్నారు ప్రజలు... రోజులు గడుస్తున్నా చలనం లేని కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో.. గ్రామగ్రామాన, ప్రతి మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఎంతకూ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడంతో... వామపక్షాలు రాష్ట్రాబంద్కు పిలుపునిచ్చాయి. దశాబ్దాల పాలనలోనూ దశ మారని పేదలకు కనీసం గూడు కావాలని పోరాటానికి దిగాయి. ఉద్యమ చరిత్ర కలిగిన ముదిగొండలోనూ ప్రజలు ఆ పోరాటాన్ని, నిరసనల్ని భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు.
రోడ్డు పక్కన టెంటులో నిరసన కొనసాగిస్తూనే... బంద్‌లో పాల్గొంటున్నారు. క్షణాల్లో అక్కడికి చేరిన పోలీసులు.. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న బండి రమేశ్‌ను ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. వలయంగా ఏర్పడి అడ్డుకున్నారు ప్రజలు. తమకెదురు చెప్పడాన్ని సహించలేని పోలీసులు పై నుంచి ఉన్న ఆదేశాలతో దుర్మార్గానికి తెరతీసారు. ఏఎస్పి రమేష్ బాబు, సీఐ సురేందర్‌రెడ్డి నేతృత్వంలో... ఆధునిక ఆయుధాలతో నిరాయుధులైన ప్రజలపై యుద్ధం ప్రకటించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి అత్యుత్సాహంతో దూసుకొచ్చిన పోలీసులు నేరుగా జనంపై పడ్డారు. ఎకె-47 తుపాకులకు పని చెప్పారు... ధన్దన్మని మోగుతున్న తుపాకులు... రయ్యిన దూసుకొచ్చిన తూటాలు... నేరుగా పేదల శరీరాల్ని ఛిద్రం చేయగా చిందిన నెత్తురు కాల్వలయి పారింది...
క్షణాల్లో ముదిగొండ ప్రధాన చౌరస్తా పేదల ఆహాకారాలతో నెత్తుటేరుగా మారింది. ఈ మారణ హౌమంలో... శవాలా దిబ్బగా కనిపించింది. క్రూరమైన ఈ దాడిలో ఏడుగురు నేలకొరిగారు. ఇసుకల గోపయ్య, ఎనగందుల వీరన్న, కత్తుల పెదలక్ష్మీ, బంకా గోపయ్య, జంగం బాలస్వామి, చిట్టూరి బాబూరావు, పుసుపులేటి కుటుంబరావు అమరులయ్యారు.
ఈ ఘటనలో మరో 16 మందికి బుల్లెట్ గాయాలు కాగా, ముగ్గురు శాశ్వత వికలాంగులయ్యారు.
ఇంతటి ఘోర ఘటనకు కారణమేమిటి? ఒక్కటే 'భూపోరాటం'. అనాదిగా ధనవంతులు, ఉన్నత వర్గాలు, ఉన్నత కులాల ఆధిపత్యం కిందే ఉన్న భూమిని పంచితే... తమ ఆటలు సాగవనీ ఈ ఉద్యమాన్ని ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందనేది పాలక వర్గాల ఆలోచన. అందుకే ఈ పోరాటాన్ని నేరుగా ఎదుర్కోలేక దొంగదెబ్బ తీసేందుకు ముదిగొండను కేంద్రంగా ఎంచుకున్నారు. పథకం అమలు చేశారు. బలగాలెన్ని దిగినా జడవని పోరు బిడ్డల పైకి హెచ్చరికలు లేకుండా విరుచుకుపడి పలువురి ప్రాణాలు బలిగొన్నా... జనమంతా ముదిగొండకు అండగా నిలిచింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కలెక్టర్ కార్యాలయం వద్ద శవాలతోనే ఉద్యమం సాగింది. మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, రెండు ఎకరాల భూమి హామీతోనే అంతిమ సంస్కారాలకు కదిలింది ప్రజాదండు.
పట్టపగలు, నట్ట నడి రోడ్డుపై, పేదల్ని పిట్టల్లా కాల్చేసిన ఈ దుర్మార్గంపై రాష్ట్రం, దేశం మాత్రమే కాదు. ప్రపంచంలోని పలు దేశాల మానవతా వాదులు, హక్కుల కార్యకర్తలందరూ స్పందించారు. అన్యాయ్యాన్ని నిరసిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. దిగొచ్చిన వైఎస్ సర్కారు ఈ ఘటనపై విచారణకు రిటైర్డు జడ్జీ పాండురంగారావు కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల పాటు విచారణ జరిపిన కమిషన్ ఆందోళనకారుల తప్పులేదని, పోలీసుల అత్యుత్సాహం , తప్పుడు చర్యలే ముదిగొండ ఘటనకు కారణమని తేల్చింది. ఆ తర్వాత ప్రభుత్వం సీఐ, ఎస్ఐని సస్సెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ క్రమంలోనూ ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఆఫీసర్లు పేదలపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చి, భయాందోళనలకు గురి చేసినా...జనం న్యాయం వైపే నిలిచి సంఘటిత శక్తి చాటారు.
ఈ ఉద్యమ ప్రభావంతోనే వైఎస్ సర్కార్ అనివార్యంగా పేదలకు వేలాది సంఖ్యలో ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. మచ్చను కడిగేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఊరూరికి భారీగా నిధులు ఖర్చు చేసింది. పేదల్ని మళ్లీ దగ్గర చేసుకునే దిశగా తర్వాత ఇందిర జలప్రభ వంటి పథకాలూ వచ్చాయి. నిరుపేదలకు మూడు ఎకరాల పంపిణీ వంటి నేటి నినాదాల వెనకా ఆనాటి పోరాట ప్రభావం ఉందనేది కాదనలేని సత్యం.
ముదిగొండ నుదిటిపై నెత్తుటి తికలంగా నిలిచిన ఈ ఘటన నేటికీ పోరాటాలకు స్ఫూర్తిదాయకమే. అందుకే ఏడుగురు అమరుల తొలి వర్థంతికి నాటి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరైతే, 2వ వర్థంతికి సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాశ్‌కారత్, 3వ వర్థంతికి బృందాకరత్, 4వ వర్థంతికి సీతారాం ఏచూరి హాజరై ముదిగొండ అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. భవితకు దారి చూపిన వారి తెగువకు జనమంతా నేటికీ జై కొడుతున్నారు.
కాలం, కష్టాలు మారుతున్నా... ఆందోళనలు, ఆధిపత్య ధోరణులు మారుతున్నా అధికార బలం చేతిలో ఉన్నా....
జన చైతన్యం ముందు చిత్తుకాగితాలే.
బషీర్‌బాగ్, ముదిగొండ ఘటన ఏదైనా
సంఘటిత శక్తిని చాటే ఆ విలువలు.. రేపటికి వెలుగులు...
- అనంగారి భాస్కర్ ,9010502255