Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యశాఖలోని ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వస్తే ఏడు రోజుల మెడికల్ లీవులివ్వాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం డీఎంఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు సర్క్యులర్ జారీ చేశారు. కోవిడ్ మూడో దశ సమయంలో సిబ్బంది, పీజీ విద్యార్థులు, బోధనా సిబ్బంది కొందరు ఆ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంంలో వారికి కేంద్ర మార్గదర్శకాల మేరకు ఒక వారం రోజుల పాటు మెడికల్ లీవు మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరిగి విధుల్లో చేరేందుకు నెగెటివ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టం చేశారు. సెలవుల కోసం దరఖాస్తు చేసుకునే వారు కోవిడ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ను జత చేయాలని చెప్పారు. ఈ దఫా క్వారైంటైన్కు అనుమతి లేదని తెలిపారు. సెలవులకు సంబంధించి ప్రతి కార్యాలయంలో రికార్డును నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో 4,416 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 4,416 కేసులు నమోదైనట్టు, ఇద్దరు చనిపోయినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,670 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత అత్యధిక స్థాయిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301, హన్మకొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 117 మందికి చొప్పున కరోనా సోకింది. మిగతా జిల్లాల్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తున్నది.