Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మిర్చి రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. మిగత పంటలకు ఎకరానికి 25 వేలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా రూ.8.633 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రకతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు.
మోడీ గుర్తులు లేకుండా ప్రజలు చేస్తారు...
బంగ్లాదేశ్ విజయానికి సూచికగా 1972 జనవరి 26న ఇందిరాగాంధీ ఢిల్లీలో వెలిగించిన అమరజ్యోతిని ఆర్పేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ విమర్శించారు. గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇలాంటి దుర్మార్గ చర్యలను మానుకోకపోతే ప్రజలు భవిష్యత్తులో మోడీ గుర్తులను చెరిపేస్తారని హెచ్చరించారు.
గిరిజన రిజర్వేషన్లు పెంచరెందుకు?
గిరిజనుల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి, టీఆర్ఎస్ మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. కేంద్రంపై నెపాన్ని నెట్టి తప్పించుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు అవగాహన లేదనీ, ఎంపీ కవిత పార్లమెంటులో గిరిజన రిజర్వేషన్లపై ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. చెన్నప్ప కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.