Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నాపత్రం ముద్రణ మీడియాలో రావడంపై దర్యాప్తు జరపాలి : మంత్రి సబితకు ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీల్లో చాయిస్ పెంపు నిర్ణయం ప్రభుత్వానిదా? ఇంటర్ బోర్డుదా?, కొందరు వ్యక్తుల నిర్ణయమా?అని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) ప్రశ్నించింది. ఇంటర్ ప్రశ్నాపత్రాలు తయారు చేయడం, ముద్రణ వంటి అత్యంత రహస్యంగా జరిగే విషయాలు మీడియాలో రావడంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి శుక్రవారం టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య లేఖ రాశారు. ఇంటర్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయని విమర్శించారు. అధికారులు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించకుండా వారి నుంచి ఫీజులు వసూలు చేసి ఖర్చు చేయడం, అక్రమ డిప్యూటేషన్లు, ఓడీలు, ఓఎస్డీలను కొనసాగించడంపైనే దృష్టిసారిస్తున్నారని తెలిపారు. కరోనా మూడోదశ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు వినలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకుల భాగస్వామ్యం లేకుండా ప్రశ్నాపత్రాలు ఎలా తయారు చేస్తారనీ, అవి ముద్రణకు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.