Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి జిల్లాలోనూ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
- నివారణా చర్యలపై హిమచల్‌ప్రదేశ్‌లో అధ్యయనం : సమీక్షా సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కోతుల బెడదను నివారించేందుకుగానూ ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కుటుంబ నియంత్రణ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో కోతుల బెడద నివారణపై వారు సమీక్ష నిర్వహించారు. అందులో మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం దోబ్రియల్, హైదరాబాద్ సీఎఫ్ఓ ఎంజే అక్బర్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోతుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. చట్టపరిధికి లోబడి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్స నిర్వహణకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. కోతుల గణన చేపట్టాలనీ, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయాలని కమిటీకి సూచించారు. కోతుల బెడద నుంచి రైతులను గట్టెక్కించే చర్యలను వేగతరం చేయాలన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణకు కోతులను నివారించాల్సిన అవసరముందన్నారు.
అడవులు, జాతీయ రహదారులపై ప్రతి సీజన్లోనూ పండ్ల చెట్లు అందుబాటులో ఉండేలా పెంచాలన్నారు. పల్లె ప్రకృతివనాల్లో పెంచిన పండ్ల మొక్కల వల్ల మెరుగైన ఫలితాలున్నాయనీ, ఆ వనాల్లో పండ్ల చెట్లు ఉండటం తప్పనిసరి చేయాలని ఆదేశించారు. పంటలను ఆగం చేస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.