Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ట్రాలీలు, బైక్ సీజ్
- పోలీసుల అదుపులో ఐదుగురు
- పరారీలో మరో ముగ్గురు నిందితులు
నవతెలంగాణ- నల్లగొండ
పొలాలు, కాల్వల కట్టల మీద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు ట్రాలీలను, ఇంజన్ ఉన్న ట్రాక్టర్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, సీసీఎస్ సీఐ దుబ్బ అనిల్, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. గురువారం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి దుప్పలపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దురు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ట్రాక్టర్ల దొంగనం ముఠా విషయం బయటపడింది. నల్లగొండ పట్టణం ఏఆర్ నగర్‌కు చెందిన దుంప సంపత్, కట్టంగూరు మండలం పిట్టంపెల్లికి చెందిన సురిగి మధు, పానగల్‌కు చెందిన అలకుంట్ల వెంకన్న, ఖమ్మంకు చెందిన ఓర్సు రామకృష్ణ, ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘు, నల్లగొండ ఏఆర్ నగర్‌కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కాలువ కట్టల మీద, వ్యవసాయ పొలాల వద్ద, పశువుల కొట్టాల వద్ద నిలిపి ఉండే ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్నట్టు చెప్పారు. గత సంవత్సరం మార్చి 21న కట్టంగూరు మండలం పిట్టంపెల్లి గ్రామశివారు పొలం వద్ద ఒక ట్రాలీ, డిసెంబర్ 4న తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామ శివారులోని పశువుల కొట్టం వద్ద ట్రాలీని ఎత్తుకెళ్లారు. డిసెంబర్ 7న తిప్పర్తి మండలం ఖాజీరామారం గ్రామశివారు కాల్వ కట్ట మీద ట్రాలీ, 17 డిసెంబర్ 2021 రోజున కొరివేనిగూడెం గ్రామ శివారులో వ్యవసాయ తోట వద్ద ట్రాలీను దొంగిలించారు. ఈ ఏడాది జనవరి 7న నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామశివారులో పొలం వద్ద ట్రాలీతో పాటు మొత్తం 5 ట్రాలీలు దొంగతనం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ దొంగతనాలు చేయడానికి సురిగి మధుకు చెందిన ద్విచక్ర వాహనం, ట్రాలీలను తీసుకెళ్లడానికి దొబ్బల రఘుకు చెందిన ట్రాక్టర్ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఈ కేసులో దుంప సంపత్, సురిగి మధు, అలకుంట్ల వెంకన్న, ఓర్సు రామకృష్ణ, దుబ్బల రఘును అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి బైక్, ఇంజన్‌తో ఉన్న ట్రాక్టర్ సీజ్ చేయడంతో పాటు ఐదు ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై కట్టంగూరు, తిప్పర్తి, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. కేసులో సమర్థవంతంగా పనిచేసిన శాలిగౌరారం సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.