Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెల్లంపల్లి/నిజాంసాగర్
కలిసిరాని కాలం..పంట చేతికొచ్చే సమయం లో అకాల వర్షం..వెరసి నష్టాలు మిగిలాయి.. అప్పులు ఎక్కువై అవి తీర్చే మార్గం కానరాక బయటపడితే పరువు పోతుందన్న భయంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో జరిగాయి. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సారండ్ల రామయ్య- లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మల్లేష్(28) తండ్రి, అన్నతో కలిసి కొన్నేండ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది 14 ఎకరాల్లో పత్తి, 10 ఎకరాల్లో వరి వేశారు. 24 ఎకరాలకు కౌలుకు రూ.2లక్షల 40వేలు, పెట్టు బడి కోసం రూ.8లక్షలు మొత్తం రూ.10.40 లక్షలు అప్పు చేశారు. ప్రతికూల వాతా వరణంతో దిగుబడి తగ్గింది. అంతే గాక పది రోజుల కిందట కురిసిన అకాల వర్షాలతో చెట్టు మీద ఉన్న పత్తిని నాశనం చేశాయి. పత్తి చెట్టుమీదనే నల్లగా మారడంతో మల్లేష్ ఆందోళన చెందాడు. పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మల్లేష్‌కు భార్య పద్మ, కొడుకు ఉన్నారు. నెన్నెల ఎస్ఐ సౌమ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి గ్రామానికి చెందిన నెల్లి సంగమేశ్వర్(36) వ్యవసా యంలో అప్పులు మిగిలాయి. దాంతో పొలంలో నీరు పారించేందుకని వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకున్నాడు. ఎస్ఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. రైతుకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.