Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19నెలలుగా జీతాల్లేవు
- ఏపీ విద్యుత్ సంస్థల నుంచి రిలీవైన ఉద్యోగుల ఆవేదన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేయబడి, తెలంగాణ విద్యుత్ సంస్థల తిరస్కారానికి గురైన 84 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ఏంటో తేల్చాలని టీఎస్ ఆస్పిరెంట్స్ ఫోరం డిమాండ్ చేసింది. శుక్రవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫోరం అధ్యక్షులు టీవీ రావు, సభ్యులు జీవీ రమణ, శేషగిరిరావు, శ్రీమతి శ్రీలక్ష్మి, సైదులు తదితరులు మాట్లాడారు. 19 నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాకు ఆప్షన్ ఇవ్వని ఉద్యోగులను కూడా ఏపీ విద్యుత్ సంస్థలు బలవంతంగా తెలంగాణాకు పంపాయనీ, తాము విధుల్లో చేరేందుకు వస్తే, తెలంగాణ విద్యుత్ సంస్థలు అనుమతించకుండా నిలిపి ఉంచారని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేశామనీ, వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును విద్యుత్ సంస్థలు అమలు చేయలేదన్నారు. దీనిపై తాము కోర్టు ధిక్కరణ పీటీషన్ వేస్తే, దాన్నీ విచారించి, తీర్పును మూడు నెలలుగా రిజర్వులో ఉంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. 19 నెలలుగా తమకు జీతాలు ఇవ్వట్లేదని కోర్టుకు చెప్పినా, ఇంకా తీర్పును వెలువరించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కమలనాథన్ కమిటీ గైడ్ లైన్స్ ప్రకారం విభజించి ఉంటే ఏ సమస్య ఉండి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన గెజిట్‌లో ప్రభుత్వ అనుబంధ సంస్థలను పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పడంతో తాము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డామని చెప్పారు. ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వాలు సక్రమ నిర్ణయాలు తీసుకోనందున తమ ఉద్యోగాలు, జీవితాలు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాయని అన్నారు. తమకు కనీసం కరోనా వైద్యం కూడా అందివ్వట్లేదనీ, దానిబారిన పడి ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని వివరించారు. తమను తక్షణం విధుల్లోకి తీసుకొని, బకాయిలతో సహా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.