Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులపాలై అన్నదాతల ఆత్మహత్య
- రోడ్డున పడుతున్న భార్యాపిల్లలు
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల కుటుంబాలు పుట్టెడు ద్ణుఖంలో మునిగిపోతున్నాయి.. సాగు పెట్టుబడులు పెరగడం.. పంట దిగుబడి.. ఆదాయం తగ్గడం.. అప్పులు వడ్డీలతో కలిపి మోయలేని భారంగా మారడంతో ఇంటి పెద్ద తనువు చాలిస్తున్నాడు.. ఓ వైపు అప్పులు.. మరోవైపు ఇంటి పెద్ద దూరమై భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోరటికల్ గ్రామానికి చెందిన రైతు దండు బుచ్చయ్యది అత్యంత నిరుపేద కుటుంబం.. చిన్న పెంకుటిల్లు. కుటుంబ పెద్ద నిత్యం కష్టం చేస్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇల్లాలికి మందు గోలీలు లేనిది నడవదు. రైతు తన రెండెకరాల భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తూ.. భార్యాపిల్లలను ఉన్నంతలో సాకుతూ వచ్చాడు. కానీ కాలం కలిసిరాలేదు.. పొలం ఊరికి సమీపంలో ఉన్న వాగు పక్కనే ఉంది. గత యాసంగి, ఖరీఫ్ రెండు సీజన్లలో వర్షాల వల్ల చేతికొచ్చే సమయంలోనే పంట పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయింది. అరకొరగా చేతికందని ధాన్యాన్ని ఐకేపీలో పోస్తే.. నెలరోజులైనా కొనుగోలు చేయలేదు. అక్కడా వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తింది. అమ్మిన పంటకు ఉన్న రానున్న ఆదాయం.. రూ.5లక్షల అప్పులకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. ఓ రోజు బ్యాంకు వెళ్లి ధాన్యం డబ్బులు జమచేశారా లేదా విచారణ చేసుకుని ఇంటికొచ్చిన రైతు.. ఈనెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంత్యక్రియలకు కూడా చేతిలో చిల్లిగవ్వలేకపోతే బంధువులు ముందుకొచ్చి పూర్తి చేశారు. ఇప్పటికీ ధాన్యం డబ్బులు వారి ఖాతాలో జమకాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు బయటకు వెళ్లని బుచ్చయ్య భార్య పద్మ అనారోగ్యం వేధిస్తున్నా.. పిల్లల కడుపు నింపడం కోసం కూలి పనులకు వెళ్తోంది.
పెద్దఆడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెంకు చెందిన చెన్నమోని నర్సింహా(55) 2021 సెప్టెంబర్ 3 పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు, కూతురు పెళ్లిళ్లు చేశారు. తన ఐదెకరాల భూమితోపాటుగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కురిసిన వర్షాల వల్ల పంట వరదల్లో కొట్టుకుపోయింది. అంతకుముందు సీజన్లో కూడా పంట దిగుబడి రాలేదు. మొత్తంగా రూ.5లక్షల అప్పులు అయ్యాయి. వాటిని తీర్చే దారి కనిపించక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులంతా కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2వేల మంది వరకు మరణించినట్టు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అందులో నల్లగొండ జిల్లాలో 700, యాదాద్రి భువనగిరి జిల్లాలో 420, సూర్యాపేటలో 285 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. అధికారులు మాత్రం అంత మంది చనిపోలేదని చెబుతున్నారు.
త్రీమెన్ కమిటీ విచారణ..
సాగులో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న అన్నదా తలను గుర్తించడానికి త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో విచా రణ చేస్తున్నాం. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ, మండల వ్యవసాయ అధికారి ఉంటారు. నిబంధనలకు నుగుణంగా అర్హత ఉంటే ప్రభుత్వానికి పరిహారం కోసం ప్రతిపాదన పంపిస్తాం. అయితే రైతుబీమా అర్హత ఉన్నవారికి ఎలాంటి పథకాలూ వర్తించవు.
- జి.శ్రీధర్‌రెడ్డి- జిల్లా వ్యవసాయశాఖ అధికారి నల్లగొండ
వరుసగా నాలుగేండ్లు పంట నష్టమే..
నా భర్త ఏరుకొండ యాదయ్య(55) డిసెంబర్ 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాం. సొంత భూమి 14గుంటలు, మరో నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేశాం. అయితే మొదటి రెండేండ్లు వర్షాలు లేక పంట దిగుబడి లేదు.. ఆ తర్వాత రెండేండ్లు అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. దాంతో కేవలం వ్యవసాయం వల్ల జరిగిన నష్టతోనే రూ.8లక్షల అప్పుల్లో ఉన్నం. ప్రభుత్వం నుంచి ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదు. మాకు కనీసం ఇల్లు కూడా లేదు. పెద్ద మురికి కాలువ పక్కనే రేకులతో రెండు గదుల ఇల్లు ఉంది. నేను ఇప్పుడు ఒంటరి మహిళను అప్పులు ఎలా తీర్చాలో తెలుస్తలేదు.
- ఎరుకొండ లక్ష్మమ్మ- మునుగోడు