Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం హార్టికల్చర్ జిల్లా కార్యాలయం ఎదుట మిర్చి రైతుల ధర్నా
- ప్రకృతి విపత్తుగా తీర్మానం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం!
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే వరకు మిర్చి రైతుల ఉద్యమం : అఖిలపక్షం రైతు సంఘాల నాయకులు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఈ వ్యవసాయ సీజన్లో తామర, గులాబీ పురుగులు, నల్లి సోకి లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి పంట నష్టాన్ని ప్రకృతి విపత్తుగా నిర్ణయించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అఖిల పక్షం రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నుంచి జిల్లా హార్టికల్చర్ ఆఫీస్ వరకు మిర్చి రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు బొంతు రాంబాబు, మాదినేని రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపల్లి గోవిందరావు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. గతేడాది ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మిర్చి సాగు వైపు మొగ్గి ఈ వ్యవసాయ సీజన్లో సాగు విస్తీర్ణం బాగా పెంచారని తెలిపారు. కానీ మిర్చి పంటకు తామర వైరస్ సోకి ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల విస్తీర్ణంలో, తెలంగాణవ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. దాంతో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మిర్చి పండించే వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల బృందం పర్యటించి తామర పురుగు ప్రభావం వల్ల మిర్చి పంటకు నష్టం జరిగిందని నిర్థారణ చేసినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నష్టంపై స్పందించడం లేదని విమర్శించారు. రైతులు తమ పంటను వైరస్ ప్రభావం నుంచి కాపాడుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసి గతం కంటే రెట్టింపు పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల సీనియర్ నాయకులు తాతా భాస్కర్రావు, అడపా రామకోటయ్య, రైతు కూలీ సంఘం నాయకులు గుర్రం అచ్చయ్య, వాసిరెడ్డి ప్రసాద్, ఎస్కె మీరా, తాళ్ళపల్లి కృష్ణ, చింతనిప్పు చలపతిరావు, చెరుకుమల్లి కుటుంబరావు, ఐనాల రామలింగేశ్వరరావు, మద్దినేని బసవయ్య, నల్లమోతు మోహన్రావు, సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.