Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపిక నశిస్తే పోరాటానికి దిగాల్సొస్తుంది : ఐటీ, పరిశమ్రల శాఖ మంత్రి కేటీఆర్
నవతెంగాణ - సిరిసిల్ల
ఏడున్నరేండ్లలో నేతన్నల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని తాము కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఏ ఒక్క విజ్ఞప్తినీ స్వీకరించలేదని ఐటీ, పరిశమ్రలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల కలెక్టరేట్లో కరోనా నియంత్రణ, డబుల్ బెడ్రూం ఇండ్లపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాలా, నారాయణపేట, జమ్మికుంట, దుబ్బాక, కమాలాపూర్ ఇంకా మరేన్నో కేంద్రాలు టెక్స్టైల్ రంగంలో ఉన్నాయని చెప్పారు. వాటి అభివృద్ధికి పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని తెలిపారు. దీన్ని ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుదేనన్నారు.
లూమ్ అప్‌గ్రేడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలని, టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 11 చేనేత క్లస్టర్లు, మెగా పవర్‌లూం క్లస్టర్‌ను మంజూరు చేయించాలని బండి సంజయ్ ని డిమాండ్ చేశారు. అలాకాని పక్షంలో ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
వరంగల్‌లో 1250ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు నిధులు అవసరముండగా మంజూరు కోసం, సిరిసిల్లాకు రూ.50కోట్ల నిధులతో మేగా టైక్స్‌టైల్ పార్క్ మంజురు చేయాలని కేంద్రాన్ని కోరితే స్పందించలేదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నేతన్నల పక్షాన ఈ అంశాలపై మాట్లాడాలని గుర్తుచేస్తున్నామన్నారు.
ఎంపీ బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి నేతన్నల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఆ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ కు కూడా పంపిస్తున్నామని, రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు.