Authorization
Tue April 08, 2025 02:46:43 pm
- మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం
- దేశంలో అవసరం లేని మందులు వాడుతున్నారు: ప్రముఖ వైరాలజిస్ట్, డాక్టర్ విజరు ఎల్డండి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా అనేది చివరి మహమ్మారి కాక పోవచ్చనీ, అందువల్ల మరిన్ని మహమ్మా రులను ఎదుర్కొనేందుకు ప్రకృతి ఇచ్చిన హెచ్చరికగా దీన్ని భావించాలని ప్రముఖ అంతర్జాతీయ వైరాలజీ నిపుణులు డాక్టర్ విజరు ఎల్దండి సూచించారు. ఆ వైరస్కుసంబంధించి ప్రపంచవ్యాప్తంగా శరవేగం గా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా చివరిద వుతుందనే విషయాన్ని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం కరోనా మూడో దశ - ఒమిక్రాన్ - జాగ్రత్తలు అనే అంశంపై ఫేస్బుక్ లైవ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను వైజ్ఞానికంగా ఎదు ర్కోవాలనీ, ఆ విజ్ఞానం భవిష్యత్‌లో ఇలాంటి మహ మ్మారులు తలెత్తితే నిలబడేందుకు ఉపయోగపడు తుందని చెప్పారు. భారతదేశంలో డాక్టర్లు కరోనాకు అవసరం లేని మందులను సిఫారసు చేస్తున్నారని తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి స్పష్టమైన పరిశోధనల తర్వాత వస్తున్న ప్రోటోకాల్ చికిత్సను పాటించాలని సూచించారు. ప్లాస్మాథెరపీతో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్‌తో శరీరం లో సమకూరే యాంటీబాడీలు ఆరు నెలల్లో బలహీన పడుతున్నాయనీ, అందుకే ఒక డోసుకు - మరో డోసుకు మధ్య ఆరు నెలల వ్యవధి సరిపోతుందని అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసు సత్ఫలితాలనిస్తు న్నదని తెలిపారు. గబ్బిలాల్లో అనేక వైరస్లుంటా యనీ, కాని వాటికి ఏమి కాదని చెప్పారు. ఈ విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ప్రజలకు స్వచ్ఛమైన గాలి అవసరమనీ, కాలుష్యమున్న గాలిలో ఎన్-95 మాస్కు ధరించినా ఇన్ ఫెక్షన్ నుంచి తప్పించుకోలేరని తెలిపారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, గాలి సులువుగా వీచే వాతావరణం ఉండటం, వ్యాక్సినేషన్ తీసుకోవడం తదితర నిబంధనలను ప్రజలకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కు వగా ఉన్న భారతదేశంలో ఇంటి వద్దే వైద్యమందించ టం మంచిదని సూచించారు. ఆస్పత్రుల్లో చేరిస్తే మరింతగా ఇన్ ఫెక్షన్ పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. చాలా మందికి హాస్పిటలైజేషన్ అవ సరం ఉండబోదని స్పష్టం చేశారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో పిల్లలు ఎక్కువగా ప్రభావితులయ్యారని తెలిపారు. లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధించే ముం దు ప్రజల జీవనోపాధి, ఇతర వ్యాధిగ్రస్తుల ఇబ్బందు లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మల్నూపిరవిర్ ప్రభావం 30 శాతం మాత్రమేననీ, అది కూడా జబ్బు వచ్చిన మొదటి మూడు రోజుల్లోపే ఇవ్వాలని తెలిపారు. లక్షణాలు లేవని తేలిగ్గా తీసుకోలేమనీ, కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపారు.
వారిలో ఎక్కువ కాలం వైరస్
అవయవమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు, హెచ్ఐవీ రోగుల్లో కరోనా వైరస్ ఎక్కువ కాలం బతికుండే అవకాశముందని డాక్టర్ ఎల్దండి తెలిపారు. అలాంటి వారికి ఎక్కువ కాలం ఐసోలేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రజల్లో ఏడు రోజుల ఐసోలేషన్ సరిపోతుందని వెల్లడించారు. మొత్తంగా ఒమిక్రాన్‌తో ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ ఏమి కాదనే అభిప్రాయం సరికాదని తెలిపారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ అధ్యక్షులు కోయ వెంకటేశ్వర్ రావు, వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బి.ఆర్.రాహుల్, జేవీవీ హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ ఎ.సురేశ్ పాల్గొన్నారు.