- ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం తగువు పెడుతోంది - సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి - చిలీలో నయాఉదారవాద విధానాలను ప్రజలు తిరస్కరించారు: సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ప్రజలు అన్నదమ్ములు గానే కలిసిమెలిసి ఉంటున్నారనీ, ఆ ఐక్యతా స్ఫూర్తిని ప్రజాపోరాటాల్లోనూ కొనసాగించాలని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చిలీలో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న పాలకులను దింపి వామపక్షాలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య తగవు పెట్టి వనరులను దోచుకుంటున్నదని విమర్శించారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. కేంద్రం జోక్యం లేకుండా నదీజలాల సమస్యను, ఇతర అంశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సూచించారు. అయితే, ఆ పనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరారు. కరోనా సమయంలో మిగతా పార్టీలు ప్రజలను విస్మరించాయన్నారు. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వందలాది ఐసోలేషన్ సెంటర్లను పెట్టి ప్రజలకు అండగా నిలిచిన తీరును వివరించారు. సీపీఐ(ఎం) నిర్వహించిన హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా ఎంతో మందికి ఉపయోగపడ్డాయన్నారు. దేశంలో ప్రజల దృక్పథంలో మార్పు వస్తున్నదనీ, వామపక్షాలు బలంగా ఉంటే సమస్యలకు పరిష్కారం వేగంగా దొరుకుతుందని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇది దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని చెప్పారు. మనదేశంలోనూ ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతాంగ పోరాట విజయం దానికి సంకేతమన్నారు. విశాఖలోనూ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సుధీర్ఘంగా పోరాటం జరుగుతున్న తీరును వివరించారు. భవిష్యత్ కమ్యూనిస్టులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.