Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తత విషయం కేసీఆర్‌కు మూడేండ్ల తర్వాత గుర్తుకొచ్చిందా
- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ పట్టణంలో తన హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప మరేమీ లేదన్నారు. నల్లగొండను దత్తత తీసుకునే విషయం కేసీఆర్‌కి మూడేండ్ల తర్వాత గుర్తొచ్చిందా, దత్తత తీసుకున్న వ్యక్తి ఇన్ని రోజులకు వస్తారా అని ప్రశ్నించారు. దత్తత తీసుకుంటానని మాయ మాటలు చెప్పడంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. కేసీఆర్ మాటలు విని నల్లగొండ ప్రజలు మోసపోయారని, మెడికల్ కాలేజ్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదని అన్నారు. సీఎం వస్తున్నారంటే ఆయన జిల్లాలో నిర్మించినట్టు మెడికల్ కాలేజీ హామీ ఇస్తారని భావించారని, ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తారని అనుకున్నా కానీ అవేవీ లేవని అన్నారు. యాభై కోట్లు కేటాయిస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి అవుతుందని, ఉదయ సముద్రం పూర్తయితే అరవై వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు రెండు మూడు నెలలు ఇబ్బంది పడ్డారని, ఇప్పటికీ చాలా మందికి ధాన్యం డబ్బులు రాలేదని అన్నారు. ఎన్జీ కాలేజీ భవనాలను తాను కొత్తగా కట్టిస్తాననడంతోనే ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. రోడ్డు వెడల్పుతో నష్టపోయేవారికి సరైన పరిహారం ఇవ్వకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. సిద్దిపేటలో ఏవిధంగా ఇచ్చారో నల్లగొండలో కూడా పరిహారం అదేవిధంగా అందజేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ మున్సిపాలిటీకి రిటైర్ అయిన కమిషనర్ని తీసుకొచ్చారని, ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం స్థానిక ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఉండటం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి మారయ్య మరణించిన సమయంలో కరోనా కారణంగా రాలేకపోయానని, అందుకు తాను సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌ను కలిసి నల్లగొండ జిల్లా సమస్యలపై, పలు అభివృద్ధి పనులపై చర్చించి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమదె సుమన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.