Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాగిరెడ్డి వీరారెడ్డి(వీరన్న) విద్యార్థి ఉద్యమం నుంచే పార్టీలో చురుగ్గా ఉండేవారు. ఎస్ఎఫ్ఐ విస్తరణలో ఆయనదే కీలకపాత్ర. స్థానికంగా జరిగే అనేక పోరాటాలు పార్టీని ముందుకుతీసుకుపోవడానికి ఉప యోగపడ్డాయని వీరన్న సోదరడు నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి ఆవేదనతో చెప్పారు. పార్టీ రాష్ట్ర మహాసభలకు ప్రతినిధిగా వచ్చి 'నవతెలంగాణ'తో ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు. విద్యార్థి, యువజన ఉద్యమాలను సమాంతరంగా బలోపేతం చేయడానికి కృషి చేశారని చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే...1975 కాలంలో రాయినిపాళెంలో పార్టీ తక్కువే. పార్టీ కోసం పనిచేస్తున్న కాలంలో 1980లో చకిలం శ్రీనివాసరావు మునుషులైన కాంగ్రెస్ గుండాలు ఒక మహిళతో వీరన్న కండ్లల్లో కారంకొట్టి, మారణాయుధాలతో హత్య చేశారు. అప్పట్లో ఇండ్లపై దాడులు చేసి భయభ్రాంతులు చేసేవారు. రాఖీ పౌర్ణమీ రోజున మా చెల్లెలు సౌమ్య రాఖీ కడతానని చెప్పినా వినకుండా, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన వీరన్న మళ్లీ ఇంటికి రాలేదు. ప్రభాకర్‌రెడ్డి, నజీర్, వెంకట్‌రెడ్డి, రాంచందర్, గఫూర్ తదితర నేతలను ఆయన తయారు చేశారు. జెండా కూడా పెట్టలేని పరిస్థితి నుంచి మొత్తం గ్రామాన్నే కమ్యూనిస్ట్ విలేజ్‌గా మలిచాం. వీరన్న మాలి పటేల్, పోలీస్ పటేల్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. పేదల గురించి ఎప్పుడూ పాటుపడే వ్యక్తి వీరన్న. ఆయన్నుంచే నిరంతర స్ఫూర్తి పొందుతూ పార్టీ కోసం పనిచేస్తున్నా. ఇప్పుడు నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నా. ఉద్యమంతోపాటు నిర్భందంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సహకారం ఎనలేనిది. కుటుంబ బంధాలు పార్టీ పనికి ఆటంకమవుతుందనే భావనతో సొంత భార్య సలీలను వేరే వ్యక్తికి వివాహాం చేయడం గొప్పవిషయం. పెండ్లి చేసుకున్న వ్యక్తికి 15 ఎకరాల భూమి రాసిచ్చాడు.