Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటవీరుడు దోనూరు నర్సిరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
''పిరికి పందల్లారా..నన్ను ఇంకా ఎందుకు బతికిస్తున్నరు.. చంపేయండి..'' అంటూ కాంగ్రెస్ గూండాలకు ఎదురేగి ప్రాణాలు విడిచాడు నా తమ్ముడు దోనూరి సత్తిరెడ్డి..అప్పటికే కాలు, చెయి విరగ్గొట్టినా భయపడలేదు. పోరాడి అమరుడయాడు అంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ(ఎం)నేత దోనూరి నర్సిరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. సీపీఐ(ఎం) మూడో రాష్ట్ర మహాసభలకు తన భార్య నిర్మలతో కలిసి డెలిగేట్లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమ నిర్భంధం, పోరాటాలు, అనుభవాలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు. 1996లో తన ఇంటిపై నక్సలైట్లు దాడిచేశారనీ, తాను ఇంట్లో ఉన్నాననుకుని తన తమ్ముడిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. 'సర్వేల్ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉన్న రోజులవి. దేపజనార్థన్రెడ్డి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. అనేక సమస్యలపై పోరాటాలు చేశాం. నిర్భందాన్ని ఎదుర్కొన్నాం. చివరకూ నా పరిస్థితి పగలు పార్టీ పని, రాత్రి పోలీస్స్టేషన్లల్లో తలదాచుకోవడమే అయింది. స్థానిక పోలీస్ ఎస్పీ ఆ మేరకు సహకరించారు. 1996 నుంచి 2007 వరకు గన్మెన్ల రక్షణలో ఉన్నా. ఆ సందర్భంగా ఉద్యమం, తన రక్షణ కోసం 20 ఎకరాల భూమి 10 ఎకరాలకు తరిగిపోయింది. 36 ఏండ్ల ఉద్యమం జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ప్రజాపోరాటాలే తప్ప మరేమీ లేదు. తమ్ముణ్ని కోల్పోవడం నా జీవితంలో అతిపెద్దవిషాదం. కష్టాలు, నష్టాలు ఎన్ని ఉన్నా పార్టీని సమిష్టి కృషితో విస్తరించాం' అని చెప్పారు. తన రక్షణకు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డి, ఉద్యమం కోసం సలహాలు, సూచనలకు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సహకరించేవారని చెప్పారు. 'భూపోరాటం ద్వారా మర్రిగూడెంలో 20 ఎకరాలు, నాంపల్లిలో 10 ఎకరాలు దళితులకు పంచాం. వారసత్వంగా వచ్చిన ఆస్థిని పార్టీ, ఉద్యమం కోసమే వినియోగించాను. ఎంత నిర్భందం ఉన్నా పార్టీని వీడలేదు. మర్రిగూడ, నాంపల్లి, గుర్రంపోడు మండలాల్లో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడమే పార్టీ విస్తరణకు సాక్య్షం. తమ్ముడు సత్తిరెడ్డి కుటుంబ బాధ్యతలు నేనే తీసుకున్నా' అని భావోద్వేగానికి గురయ్యారు.