Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భట్టు అనురాధ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''నా భర్త శ్రీనివాస్ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల్లో పనిచేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ కౌన్సిలర్‌గా గెలుపొందారు. 17 ఏండ్ల పాటు పెద్దఎత్తున భూ పోరాటాలు చేశారు. సింగన్నగూడెం గ్రామంలో 500 కుటుంబాలకు ఇండ్ల పట్టాలిప్పించారు. ప్రజాసంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తున్న తరుణంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికి నేను గృహిణిగానే ఉన్నాను. ఆయన పొద్దునలేచి పోయి ఎప్పడో చీకటి పడ్డాక వచ్చేవాడు. నిత్యం పోరాటాల గురించే ఇంట్లో మాట్లాడుతుంటే కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా నాలో ఉండేది. కానీ, ఇప్పుడు ఆయన చేసిన సేవలు, ఆయన పోరాడి ప్రజలకు ఎంతో మేలు చేశారని అర్ధమవుతున్నది. ఆయన మరణాంతరం ఆయన ఆశయాలను కొనసాగించేందుకు నేను సైతం ప్రజా ఉద్యమాల్లో కొనసాగుతున్నాను. ఆయన పోరాటం ఫలితంగానే నేను కూడా కౌన్సిలర్‌గా గెలిచాను'' అని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భట్టు అనురాధ తన అనుభవాలను 'నవతెలంగాణ'కు చెప్పారు. జిల్లాలో పార్టీ చేపట్టిన 900 కిలోమీటర్ల పాదయాత్రలో తాను కూడా భాగస్వామినయ్యానని తెలిపారు. నిరంతరం ప్రజలు, మహిళలు, సమస్యలపై పోరాడటమే అసలైన సంతోషమనీ, దానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పార్టీ ఇస్తున్నదని అన్నారు. 'పార్టీ కార్యక్రమాలు, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల్లో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు చెప్పారు.