Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
'1975లో ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు నాతోపాటు ఏడుగురిని తీసుకెళ్లి ఎనిమిది రోజులపాటు రోజుకో స్టేషన్ చొప్పున తిప్పారు. చివరి రోజున మధిర కోర్టులో హాజరు పరిచారు. 1985-2000 మధ్య నేను పార్టీ బోనకల్ బాధ్యుడిగా వ్యవహరించా. అప్పట్లో కాంగ్రెస్తో అనునిత్యం ఘర్షణ వాతావరణం ఉండేది. అందువల్ల ప్రతీరోజూ కేసులు నమోదు చేసేవారు...' వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రజా పోరాట అనుభవం ఇది. 'ఆశలతో కాదు పార్టీ ఆశయాల కోసం పాటుపడదాం' అంటున్న ఆయనతో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల వేదిక నుంచి 'నవతెలంగాణ' ప్రత్యేక సంభాషణ...
ఆ ధోరణి మారాలి...
'మనం మన ఆశల కోసం కాకుండా పార్టీ ఆశయాల కోసం పని చేయాలి. గతంలో ఆందోళనకారులను జైళ్లలో వేస్తే.. పార్టీ నాయకత్వం వచ్చి, బెయిల్ మంజూరు చేయించేంతవరకూ ఓపిగ్గా ఎదురు చూసేవారు. ఇప్పుడు ఉదయం విడిపిస్తారా..? లేక సాయంత్రం విడిపిస్తారా..? అని అడుగుతుండటం పరిపాటిగా మారింది. వివిధ ఆందోళనల సందర్భంగా నాపై ఇప్పటి వరకూ వంద కేసుల దాకా బనాయించారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి, వైఎస్ హయాంలో భూ పోరాట కార్యక్రమాల సందర్భంగా అనేక కేసులు మోపారు. ఒక సమయంలో రెమిడిచెర్లలో 300 ఎకరాలను పంచాం. ఆ సందర్భంగా బనాయించిన కేసులకు సంబంధించి ఎనిమిదేండ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగా. ఆ రకంగా 1975 నుంచి ఇప్పటి దాకా 17 నెలలు మినహా మిగతా అన్ని నెలల్లోనూ కేసులు నమోదు చేశారు...'
నిర్లిప్తత ఒద్దు.. రాబోయే రోజులు మనవే...
'ప్రస్తుతం యువ కార్యకర్తలు, నాయకులు... సోషలిజం మన దరిదాపుల్లో లేదులే.. అనే నిరాశా, నిస్పృహల్లో ఉన్నారు. ఈ భావన నుంచి బయటపడాలి. ప్రజా సమస్యలపై నికరంగా, నిరంతరంగా పోరాటం చేస్తూ... జనాన్ని అంటిపెట్టుకుని ఉంటే కచ్చితంగా భవిష్యత్ మనదే. సమాజ మార్పు కోసం పాటుపడుతున్న మనం... శరవేగంగా ముంచుకొస్తున్న బీజేపీ మతోన్మాద, ఆర్థిక విధానాలపై పోరుకు నడుం బిగించాలి...'