Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముదిగొండ భూపోరాటం ఓ చారిత్రక ఘట్టం..: సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్
'నా ఉద్యమ జీవితంలో ముదిగొండ భూ పోరాటం ఒక చారిత్రక ఘట్టం. ప్రజల కోసం పని చేసే నాయకులకు ప్రమాదం ఏర్పడితే... అదే ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుకుంటారనే విషయాన్ని ఆ పోరాటం నిరూపించింది. ముదిగొండ భూ పోరాట సమయంలో ప్రజలే నన్ను కాపాడారు...' అని సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేశ్ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 1984-85లో ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థుల హాస్టల్ సమస్యలు, కాస్మొటిక్ ఛార్జీల పెంపు కోసం ఆందోళన నిర్వహిస్తే... తమపై అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిందని అన్నారు. 1990లో మిర్చి రైతుల పోరాటానికి మద్దతిచ్చిన సమయంలో పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వివరించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర మహాసభల వేదిక నుంచి తన అనుభవాలను ఆయన 'నవతెలంగాణ'తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
వలయంగా ఏర్పడి రక్షించారు...
భూమి, ఇండ్ల స్థలాల పోరాటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనా క్రమంలో 2007 జులై 28న ముదిగొండలో పోలీసులు రక్తపాతం సృష్టించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విచక్షణారహితంగా నేరుగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నన్ను బూటు కాళ్లతో ఛాతీమీద బలంగా తన్నారు. తల మీద లాఠీలతో బాదారు. స్పృహ తప్పి పడిపోయాను. ఆందోళనలో భాగ స్వాములైన ప్రజలు ఈ పరిస్థితిని గమనించారు. నా చుట్టూ వలయాలుగా ఏర్పడి పోలీసుల చేతికి చిక్కకుండా ఒక ఇంట్లో రహస్యంగా దాచారు. ఆ విధంగా ముదిగొండ భూ పోరాటం చరిత్ర పుటల్లోకెక్కింది. ఆనాటి ప్రధాని మన్మోహన్, సోనియాగాంధీ సైతం దీనిపై స్పందించారు. ఈ ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ పాండురంగారావు కమిటీ నెలల తరబడి విచారించి, పోలీసులదే తప్పని తేల్చింది. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు, సాక్షులైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు ఆనాటి వైఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఏ ఒక్కరూ వీటికి లొంగలేదు. అదీ ఆ పోరాట విశిష్టత.
వ్యక్తిగతంగా లొంగదీసుకునేందుకు...
ముదిగొండ ఘటన తర్వాత ఆ కేసు నుంచి ప్రభుత్వాన్ని, పోలీసులను రక్షించేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు వ్యక్తిగతంగా నన్ను బెదిరించటం ద్వారా తప్పంతా సీపీఐ (ఎం)దే అని చెప్పించేందుకు కుయుక్తులు పన్నారు. పాస్ పుస్తకాల్లేవనే కారణంతో మా ఎనిమిదెకరాల భూమిని వివాదాల్లోకి లాగారు. మా నాన్నను, ఇతర కుటుంబ సభ్యులనూ బెదిరించారు. ఆఖరికి నా మీద రౌడీషీట్ కూడా తెరిచారు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. వీటన్నింటినీ తట్టుకుని అదరక, బెదరక ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకూ నేను ఏడాదిన్నరపాటు జైలు జీవితాన్ని, ఆరేడు నెలలపాటు రహస్య జీవితాన్ని గడిపా. నాపై ఇప్పటి వరకూ 80 దాకా అక్రమ కేసులను బనాయించారు.
ధృఢంగా నిలబడాలి...
'ఆనాడు ప్రగతిశీలంగా ప్రజా సమస్యలపై ఉద్యమించిన యువతపై పాలకులు, పోలీసులు కేసుల రూపంలో ప్రత్యక్షంగా దాడి చేశారు. బెదిరింపుల ద్వారా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ ప్రత్యక్ష దాడి స్థానంలో మానసికంగా బలహీనపరుస్తూ పరోక్ష దాడికి పాల్పడుతున్నారు. డబ్బులివ్వటం ద్వారా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తు న్నారు. విష ప్రచారాల ద్వారా యువత మెదళ్లను కలుషితం చేస్తున్నారు. ఇలాంటి కుయుక్తులను అర్థం చేసుకోవటం ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని సంతరించుకోవాలి. ధృఢంగా నిలబడాలి.