Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలి
- పలు తీర్మానాలకు మహాసభ ఆమోదం
- కామ్రేడ్ సున్నం రాజయ్యనగర్
(తుర్కయాంజాల్) నుంచి నవతెలంగాణ ప్రతినిధి
సీపీఐ(ఎం) తెలంగాణ మూడో మహాసభ సోమవారం పలు తీర్మానాలను ఆమోదించింది. రెండ్రోజులుగా కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్ (తుర్కయాంజాల్)లో సభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు పలు అంశాలపై ప్రతినిధులు చర్చించి తీర్మానాలకు ఆమోదం తెలిపారు. వామపక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తులతో విశాల ఐక్య సంఘటను నిర్మించాలని మహాసభ నిర్ణయించింది. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల పట్ల ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వివక్ష ప్రదర్శిస్తున్నదని మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం కోసం కుల, మత రాజకీయాలను రెచ్చగొడుతూ దేశాన్ని ముక్కలు చేస్తున్న బీజేపీ కులగణనకు నిరాకరిస్తున్నదని తప్పుబట్టింది. వెంటనే కులగణను చేపట్టాలని డిమాండ్ చేసింది.
వ్యవసాయ సమస్యలు
రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు ఆందోళకరంగా ఉన్నాయని మహాసభ అభిప్రాయపడింది. ఈ రంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఒక శాస్త్రీయమైన ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకోవాలని సూచించింది. ప్రధానంగా అన్నీ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు నిర్ణయించి అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కౌలు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని చేయాలని విజ్ఞప్తి చేసింది. ధరల పెరుగుదల వ్యవసాయ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దారిద్రం, ఆకలి చావులు మరింతగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది.
దళితుల సంక్షేమం...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాల ఫలితంగా దళితులు తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారని మహాసభ నిరసన వ్యక్తంచేసింది. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిసాధించినప్పటికీ కులాధిపత్య పెత్తందారి పోకడలు పెట్రేగిపోతున్నాయని మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. కులదురంహకార హత్యలను ప్రతిఘటించాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేసింది.
చేతివృత్తులు...
రాష్ట్రంలో చేతివృత్తులు నిర్వీర్యమై ఉపాధి దెబ్బతిన్నదని మహాసభ తీర్మానించింది. నయా ఉదారవాద విధానాలతో వృత్తులు నాశనమవుతున్నాయనీ, దీని ఫలితంగా ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన తెలియజేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) పేరుతో రాష్ట్రంలో అరాచకం కొనసాగుతున్నదనీ, వీటిని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేసింది.
మైనార్టీల పరిస్థితి...
రాష్ట్రంలో 12.5 శాతం జనాభా గల ముస్లిం, మైనార్టీల ఆర్థిక, సామాజిక పరిస్థితులు రోజురోజుకు దిగజా రుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. వారి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడంతోపాటు ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి సంపూర్ణంగా అమలుచేయాలని విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించే చర్యల పట్ల మహాసభ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే బీజేపీ ప్రభుత్వ విధానంగా మారిందని పేర్కొంది. జాతిసంపదను రక్షించుకునేందుకు జరిగే పోరాటాల్లో ప్రజలు భారీగా భాగస్వాములు కావాలని కోరింది. కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించింది. ఈ చట్టాలతో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా స్కీం వర్కర్ల భవిష్యత్ అంధకారంలో పడిందని చెప్పింది. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి స్కీంల ప్రయివేటీకరణను ఆపాలని తీర్మానించింది. రాష్ట్రంలోని బొగ్గు నిల్వలు సింగరేణికి కేటాయించాలని మహాసభ డిమాండ్ చేసింది. బ్లాకుల వేలాన్ని తక్షణం నిలిపివేయాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా ప్రజారవాణా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందనీ, దానికి తక్షణమే నిధులు కేటాయించి, కార్మికుల హక్కులను కాపాడాలని తీర్మానం చేసింది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించింది. ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నిర్ధిష్టకాలంలో పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ధరణి వెబ్‌సైట్‌తో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అమల్లో జరిగిన లోపాలను గుర్తించి, సరిచేసి రైతులకు పాసుపుస్తకాలను ఇవ్వాలని కోరింది. ప్రజల సంపదను లూటీ చేసే ప్రమాదకరమైన జాతీయ నగదీకరణ పైపులైన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని మహాసభ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.