Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలు బలపడితేనే దేశానికి మేలు
- ప్రజాపునాదిని పెంచుకోవడమే లక్ష్యం
- క్షేత్రస్థాయిలో జనంతో మమేకమవుతాం
- మోడీ నిర్ణయాలపై కేసీఆర్ లాలూచీ కుస్తీ
- టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలపైనా ఉద్యమం : సీపీఐ(ఎం) నేతలు ఎస్ వీరయ్య, జి నాగయ్య, పోతినేని
సున్నం రాజయ్య నగర్
(తుర్కయంజాల్) నుంచి బొల్లె జగదీశ్వర్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవి పరిష్కారమయ్యేదాకా భవిష్యత్ సమరశీల పోరాటాలను నిర్వహిస్తామని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జీ నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. సమస్యను గుర్తించడం, పరిష్కారం కోసం ధర్నా, ప్రదర్శన వరకే పరి మితం కాబోమన్నారు. ప్రజాపునాదిని పెంచు కోవడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం స్ఫూర్తితో ప్రజలతో మమేకమై పనిచేస్తా మనీ, దీనికోసం క్షేత్రస్థాయికి వెళ్తామన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ ఉద్దేశ్యమే అది అని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యలు, వామపక్ష పార్టీల బలోపేతానికి సంబంధించి 54 తీర్మానాలను రూపొందించామన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసిందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అనేక హామీలిచ్చిందని గుర్తు చేశారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజ నాలుండే సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని విమర్శించారు. తక్షణమే ఓట్లు, సీట్లు తెచ్చే ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఉపయోగించుకుని బలపడాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మిక చట్టాలను రద్దు చేసిందనీ, రైతుల నడ్డివిరిచేలా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని వివరించారు. రైతాంగం పోరుతో ఆ చట్టాలను రద్దు చేసినా ఆ ప్రమాదం ఇంకా పొంచిఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నదనీ, మతపరమైన చిచ్చుపెట్టి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నదని విశ్లేషించారు. దుబ్బాకలో మతవిభజన, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాలను ఏరివేస్తామంటూ అలజడి సృష్టించిందని అన్నారు. ప్రమాదకర శక్తిగా ఎదుగుతున్న మతోన్మాద బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న తప్పుడు నిర్ణయాలపై కేసీఆర్ లాలూచీ కుస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నికరంగా కేంద్రంతో కొట్లాడాలనీ, సమస్యల పరిష్కారంపై తేల్చుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపైనా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఉద్యమాల్లోకి రావాలనీ, మతపర విభజనను చిత్తుచేయాలని కోరారు.
బీజేపీ, కాంగ్రెస్ అనుసరించే విధానాల్లో తేడాలేదన్నారు. ఆ రెండు పార్టీలూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అనుకూలమని అన్నారు. దేశాన్ని ఈ స్థితికి దిగజార్చిన ఘనతలో కాంగ్రెస్‌కూ ప్రధాన పాత్ర ఉందన్నారు. పార్టీ అఖిల భారత మహాసభ తీర్మానం ప్రకారం కాంగ్రెస్‌తో పొత్తు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. వామపక్ష పార్టీలు బలంగా ఉన్నచోట పోటీ చేస్తున్నామనీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నపుడు తాము ప్రాంతీయ పార్టీని బలపరిచామని చెప్పారు. బీజేపీని, టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే సీపీఐ(ఎం), వామపక్షాలు బలపడాలనీ, అప్పుడే దేశానికి, రాష్ట్రానికి మేలు కలుగుతుందని అన్నారు. ఎన్నికలొచ్చినపుడు రాజకీయ అవగాహన ఎలా ఉంటుందో అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆరితేరిన వారే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు. పార్టీలో యువతను, మహిళలను ప్రోత్సహిస్తామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు : జీ నాగయ్య
ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లంచుకోకతప్పదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య హెచ్చరించారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి కొనిస్తామనీ కేసీఆర్ చెప్పినపుడే అది అసాధ్యమని కమ్యూనిస్టు పార్టీలు చెప్పాయని గుర్తు చేశారు. సెంటు భూమి లేని కుటుంబాలు మూడు లక్షలున్నాయని చెప్పారు. వారికి మూడెకరాల చొప్పున పంచాలంటే తొమ్మిది లక్షల ఎకరాలు, ఎకరా, రెండెకరాలున్న వారికి మరో తొమ్మిది లక్షల ఎకరాలు కలిపి మొత్తం 18 లక్షల ఎకరాల భూమి అవసరమని వివరించారు. భూముల రేట్లు పెరుగుతాయని ఆనాడే కేసీఆర్‌కు సోయిలేదా?అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం రూపొందించిన భూసీలింగ్ చట్టం ప్రకారం పదెకరాలే ఉండాలన్నారు. ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే భూమి కొనకుండానే ఎస్సీ,ఎస్టీ, పేదలందరికీ భూమిని పంచొచ్చని సూచించారు. పోడు భూములకు ఇంకా పట్టాలివ్వలేదని అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. వీడీసీల అరాచకాలను అరికట్టాలనీ, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం అగ్రకుల పెత్తందారుల ఆగడాలను ప్రోత్సహించేలా ప్రభుత్వ తీరు ఉందన్నారు. దళితులు స్వతంత్రంగా జీవించాలంటే భూపంపిణీ, విద్య అందించాలని కోరారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష : పోతినేని
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పక్షపాత ధోరణి, సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నదని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనూ అమలు చేయడం లేదన్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉందని వివరించారు. అయినా సింగరేణిలో నాలుగు బొగ్గుబావులను ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షను విడనాడాలనీ, అఖిలపక్ష పార్టీలను కలుపుకుని సీఎం కేసీఆర్ పోరాటాలకు సన్నద్ధం కావాలని కోరారు.
పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి : కె భాస్కర్
రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్, టాటా ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్ డిమాండ్ చేశారు. ఆ పరిశ్రమలు నెలకొల్పేందుకు భూమిని కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీని ఎందుకు తేలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో దివి ఫార్మా సంస్థ వల్ల వివిధ గ్రామాల్లో గాలి, నీరు, ఆహారం కలుషితమయ్యాయని చెప్పారు. ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం వల్ల డజను గ్రామాలను ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం తీసుకునే హక్కు లేదా?అని ప్రశ్నించారు. జనావాసాలు లేనిచోట ఫార్మా కంపెనీలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు డమ్మీలుగా మారారనీ, కలెక్టర్లు సీఎం కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. భూనిర్వాసితుల సమస్యపై స్థానిక ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమిస్తామన్నారు.