Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- రూ. 587 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-మణికొండ
హైదరాబాద్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.1200 కోట్లతో తాగునీటి సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రికేటీఆర్ అన్నారు. సోమ వారం రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాల్టీ పరిధిలోని అల్కాపురి రోడ్డు నెంబర్ 4లోని స్పోర్ట్ పార్క్‌లో రూ.587 కోట్లతో చేపడుతున్నఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టు పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, వాణీ దేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా మణికొండలోని అల్కాపురిలో రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టును ప్రారంభించా మన్నారు. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా రూ. 6వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రానున్న 30 ఏండ్లలో హైదరాబాద్ కు వచ్చే జనాభాను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపు ఉన్న 25 మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు నిధులు కేటాయించినట్టు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో తాగునీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్‌లో ఇక్కడ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓఆర్ఆర్లోని గ్రామాలు, కాలనీలు, గ్రేటేడ్ కమ్యూనిటీలకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కస్తూరి నరేందర్, టీఆర్ఎస్ మున్సి పల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మణికొండ మున్సిపల్ అధ్యక్షులు బుద్ధోలు కావ్య శ్రీరాములు, మహిళా ప్రెసిడెంట్ రూపరెడ్డి, నాయకులు సగం శ్రీకాంత్, ఏర్పుల కుమార్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.