Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేసి ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
అర్ధరాత్రి ఇంట్లో వ్యాయామం చేయొద్దన్నందుకు డంబెల్స్‌తో తల్లి తలపై కొట్టి హతమార్చాడు కొడుకు. ఈ ఘటన హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంకోఠి ప్రాంతంలో నివాసముండే కొండ పాపమ్మ(45)కు కొడుకు సుధీర్ కుమార్, కూతురు ఉన్నారు. భర్త పాపమ్మ భర్త ఆరేండ్ల కిందట చనిపోయాడు. దీంతో ఆమె ఇండ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన సుధీర్ కుమార్ ఖాళీగా ఉంటున్నాడు. కొద్ది రోజులుగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. సోమవారం అర్ధరాత్రి అతడు ఇంట్లో డంబెల్స్‌తో వ్యాయామం చేస్తున్నాడు. ఈ సమయంలో చేయొద్దని తల్లి అతనికి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన సుధీర్ డంబెల్స్‌తో తల్లి తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అతని చెల్లెలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమెపైనా దాడి చేయడంతో స్వల్పం గా గాయపడింది. స్థానికులు సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుధీర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. పాపమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.