Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైలుశిక్షతో పాటు రూ.12వేల జరిమానా
- కాల్పుల ఘటనలో ప్రత్యేక కోర్టు తీర్పు
- చంచల్‌గూడ జైలుకు తరలింపు
నవతెలంగాణ- విద్యానగర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్, ఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్అహ్మద్కు జీవితఖైదుతో పాటు రూ.12వేల జరిమానా విధిస్తూ సోమవారం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు వెల్లడించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఏ2, ఏ3ని నిర్ధోషులుగా విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో 2020 డిసెంబర్ 18న పిల్లల క్రికెట్ వివాదం పెద్దల ఘర్షణకు దారి తీసింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ ఫారూఖ్ అహ్మద్, అదే కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్ కుటుంబాల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ క్రమంలో ఫారూఖ్అహ్మద్ తుపాకీతో సయ్యద్ జమీర్, మోతేసిన్పై కాల్పుల జరపగా.. జమీర్ ఆస్పత్రిలో మృతిచెందాడు. మోతేసిన్ గాయపడ్డాడు. ఈ ఘటనలో సయ్యద్ మోతేసిన్ ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి 88 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశారు. ఆదిలాబాద్ పోలీసుల అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ కేసును ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది. మొత్తం 36 మంది సాక్షుల నుంచి వివిధ రకాల సాక్ష్యాలు సేకరించి రెండో పట్టణ సీఐ పోతారం శ్రీనివాస్ చార్జిషీటు దాఖలు చేశారు. ప్రత్యేకంగా సీడీఓలు ఎం.శ్రీనివాస్, జోగు శ్రీకాంత్ సాక్షులను కోర్టు ఆదేశం మేరకు హాజరుపరిచారు. ప్రత్యేక పీపీ ఎం.రమణారెడ్డి 24 మంది సాక్షులను విచారించారు. ఈ కేసు విచారించిన ప్రత్యేక న్యాయస్థానం మొదటి అదనపు సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన అనంతరం పోలీసులు ఫారూఖ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదరుకుమార్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ, పోలీసులను ఆయన అభినందించారు.