Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సున్నం రాజయ్య నగర్ నుంచి అచ్చిన ప్రశాంత్
సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల్లో ప్రజానాట్యమండలి కళాకారుల బృందం ప్రదర్శించిన కళారూపాలు ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. ఆటాపాటా..నాటక, నృత్యప్రదర్శనలు స్ఫూర్తి రగిలించాయి. ఆలోచింపజేశాయి. 'పల్లెపల్లెలో ఎగరాలి ఎర్రజెండా..గల్లిగల్లినా ఎగరాలి ఎర్రజెండా' అంటూ యువకళాకారుల నృత్య ప్రదర్శన మహాసభను ఉర్రూతలూగించింది. బండి సత్తన్న రచించిన 'రంగారెడ్డి జిల్లా..రాచకొండ జిల్లా..వీర యోధుల గడ్డ ఇబ్రహీంపట్నం నేల' అంటూ... కృష్ణమూర్తి, పోచమోని జంగయ్య, కోటప్ప, అడివయ్య, శివయ్య, జంగారెడ్డి, పాషా-నరహరి, మస్కు నర్సింహ్మ, మంచాల, ఆరుట్ల, జాపాల, చింతుల్ల, పెత్తుల్ల, రావిరాల, బండలేమూరు, దండుమైలారం, లింగంపల్లి, మేడిపల్లి, కొత్తపల్లి, కుర్మిద్ద, తదితర గ్రామాల అమరవీరులను తలుచుకుంటూ గాయకుడు నర్సింహ్మ పాడిన పాట రంగారెడ్డి జిల్లా ఉద్యమ చరిత్రను కండ్లకు కట్టింది. 'నీవే నీవే వెలుగుదారైనవే..నీవే నీవే అమరుల గుర్తువైనవే..' అంటూ సీపీఐ(ఎం) ఆవశ్యకతను గుర్తు చేస్తూ కవి, సాహితీవేత్త ఆనందాచారి రాసిన పాటను ఆనంద్ తన గళం ద్వారా మహాసభకు వినిపించారు. 'కమ్యూనిస్టులం.. కార్యశూరు లం.. కమ్యూనిస్టులం..మార్క్సిస్టులం... మోసాలు, ద్వేషాలు పార్టీ నేర్పలేదు..మంత్రాలు, కుతంత్రాలు తెలుపలేదు..మూఢత్వాలను వీడమన్నది పార్టీ..కుల, మతాలను పక్కనబెట్టమన్నది..' అంటూ యువ గాయకుడు ఆజాద్ పాట పాడుతున్నంతసేపూ మహాసభ చప్పట్లతో మార్మోగింది. యువ రచయిత వంశీకృష్ణ రాసిన 'తిన్నదరుగక లోకం ఒకవైపు..తిండి దొరక్కశోకం ఒకవైపు..తరగని సంపద ఒకవైపు..తరగని దరిద్రం ఒకవైపు..జైబోలో భారత్‌మాతా..ఏంటమ్మా ఈ బాధ..నీ పిల్లలకు తీరని ఈ గాథ' అంటూ సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలను ఎత్తిచూపుతూ పీఎన్ఎమ్ రాష్ట్ర నాయకులు నాంపల్లి చంద్రమౌళి పాడిన పాట సభికుల్ని ఆలోచింపజేసింది.
గణేశ్, వినోద్ నేతృత్వంలోని డప్పుల ప్రదర్శన ఉర్రూతలూగించింది. 'రమ్మంది..రమ్మంది ఎర్రబాట రాగమై పాడింది పూలతోట' అంటూ ఆనంద్ పాడిన పాట ఆకట్టుకున్నది. అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక, యాసిడ్ దాడులు, ర్యాంగింగ్కు వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా యువతులు ప్రదర్శించిన కళా ప్రదర్శన ఎంత ఘోరం...అయ్యో అనేలా ఆలోచింపజేసింది. 'నా తల్లి తెలంగాణ... తల్లడిల్లే తెలంగాణ' అంటూ ఉయ్యాల పాట బాగుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తున్న పన్నుల భారం, పెట్రోలు డీజిల్ ధరలపై నియంత్రణలేమితో నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయనే విషయాన్ని చెబుతూ ప్రదర్శించిన 'ధరల దెబ్బ' నాటకం ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబింపజేసింది. కోలాట ప్రదర్శనకారుల స్టెప్పులతో సభావేదిక దద్దరిల్లింది. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆనంద్, కట్ట నర్సింహ్మ పర్యవేక్షణలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.