Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ ఉద్యోగం నుంచి తొలగించాలి
- పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం డిమాండ్
నవతెలంగాణ-ములకలపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీలోని సాకివాగు ఆదివాసీ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన అటవీశాఖ ఉద్యోగి మహేష్‌పై సత్వరమే పోక్సో కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం జిల్లా నిజనిర్ధారణ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బాధ్యుడైన మహేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సోమవారం సాకివాగు ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి సంఘటనా స్థలాన్ని, బాధితులను పరామర్శించి వివరాలు సేకరించి మీడియాకు వెల్లడించారు. 19న సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని అడవికి నలుగురు మహిళలు వంట చెరుకు కోసం వెళ్లారు. వీరి రాకను గమనించిన ఆ ప్రాంత ఫారెస్ట్ ఉద్యోగి మహేష్ వారిని వెంబడించారు. మైనర్ బాలికను మొదటిగా ఆటకాయించేందుకు ప్రయత్నం చేయగా బాలిక పరుగుతీసింది. వర్రెలోకి దిగి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించింది. మహేష్ ఆగకుండా వర్రెలోకి దిగి బాలికను వివస్త్రను చేశాడు. బాలిక కేకలు వేయగా బాలిక అక్క అక్కడికి చేరుకుంది, కానీ ఆమెను కూడా మహేష్ లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఎక్కడైనా ఎవరికైనా చెబితే.. మీ అంతుచూస్తామని బెదిరించడంతో వారు రెండు రోజుల వరకు ఎవరికి చెప్పలేదు. ఈ సంఘటన మీడియా దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే 22న ములకలపల్లిలో ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ విచారణ చేయలేదు. కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారని బృందం సభ్యులు తెలిపారు.. ఈ నిజ నిర్దారణ బృందంలో సీఎల్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు , సాగర్, మోహన్, కె.మురళి తదితరులు ఉన్నారు.
సాకివాగు ఘటనపై అధికారులు విచారణ
సాకివాగు ఆదివాసీ గ్రామ మహిళలపై అటవీశాఖ అధికారి దాడి ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం ఐటీడీఏ, ఐసీడీఎస్ అధికారుల బృందం విచారణకు వచ్చింది. ఈ క్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్, డీటీ శ్రీనివాసరావు, ఆర్ఎస్ఐ పద్మావతి, ఐసీడీఎస్ డీసీపీవో హరికుమారి, సీడీపీవో రేవతి కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. తమ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్టు తెలిపారు. ఈ విచారణ బృందంలో స్థానిక వీఆర్వో చిట్టిబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి, సఖి అడ్మిన్ శుభశ్రీ తదితరులు ఉన్నారు.