Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
- మార్కెట్ ప్రధాన కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు. జెండా పాటలో ఒకరిద్దరికి మాత్రమే మద్దతు ధర ఇచ్చి మిగతా రైతులకు తక్కువ ధర ఇవ్వడంతో రగిలిపోయారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, మిర్చి యార్డు నుంచి మార్కెట్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో ఇంతేజార్ గంజ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో వ్యాపారు లతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి పరిశీలించాలని, ధరలు సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. ఈ విషయంలో.. ఇప్పటికే నిర్ణయించిన ధరకు రూ.2వేలు అదనంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు అధికారులు కాంటాలు నిర్వహిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. మిర్చి యార్డులోని కంటాలను ధ్వంసం చేశారు. మిర్చిని లోడ్ చేస్తున్న డీసీఎం వాహనంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. మిర్చి బస్తాలను కింద పడేశారు. రైతుల దాడిని అడ్డుకొన్న ఏసీపీ, సీఐ మల్లేష్ యాదవ్ రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. రైతులతో మార్కెట్ అధికారులు, పాలకవర్గం జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో సాయంత్రం వరకు మిర్చి యార్డులో కాంటాలు జరగలేదు. దాంతో నేడు, రేపు మార్కెట్‌యార్డుకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సెలవు ప్రకటించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యాపారస్తులు మార్కెట్ అధికారులు కుమ్మక్కై కావాలనే ధరలు తగ్గిస్తున్నారని రైతులు విమర్శించారు. సోమవారం వరంగల్ మార్కెట్ యార్డుకు సుమారు 20,000 మిర్చి బస్తాలు రాగా అందులో తేజాలకు జెండా పాటలో రూ. 17,200 ధర పెట్టారని అన్నారు. ఒకరిద్దరికి మాత్రమే గరిష్ట ధర పెట్టి మిగతా వారికి రూ.14వేల లోపు ధర చెల్లించారని వాపోయారు. ఒకే క్వాలిటీ ఉన్న మిర్చికి ధరలో ఇంత తేడా ఎందుకని ప్రశ్నించారు. సాధారణంగా ఒకే రకం మిర్చికి ధరలో రూ.500 నుంచి రూ.1000 తేడా ఉంటుందని, కానీ, వ్యాపారులు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు తేడాతో కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.14వేల లోపు ధర పెట్టిన రైతులకు మరో రెండు వేలు కలిపి చెల్లించాలని డిమాండ్ చేసినా వ్యాపారుల నుంచి స్పందన లేదని వాపోయారు. ఇప్పటికే అధిక వర్షాలు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోయిన తమకు ఉన్న కొద్దిపాటి పంట అమ్మడానికి మార్కెట్‌కు వస్తే తమను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాధిత రైతులకు సీపీఐ(ఎం) కాశిబుగ్గ ఏరియా కార్యదర్శి బషీర్ అహ్మద్ మద్దతు తెలిపి మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఒకే రకం మిర్చి పంటకు ధర రూ.6వేల నుంచి రూ.7వేల తేడా ఉండటం ఏమిటని ప్రశ్నించారు.
అధికారుల నుంచి స్పందన లేదు : కిషన్‌రావు, నర్సక్కపల్లె, నడికూడ, వరంగల్
ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పటివరకు తిండి లేదు, నీళ్లు లేవు. రెండు ఎకరాల్లో మిర్చి తోట వేస్తే నాలుగు బస్తాలు పండింది. మార్కెట్‌కు వస్తే ఒక ఇద్దరికీ ధర రూ.17,200 పెట్టి మిగతా వారికి రూ.10వేల నుంచి రూ.14వేల లోపు చెల్లిస్తు న్నారు. ఇప్పటికే వడగండ్ల వాన, తెగుళ్లతో నష్టపోయాం. పెట్టుబడి, కూలీల చార్జీలు పెరిగాయి. ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి మిర్చి పంట కొనుగోలు చేయాలి.