Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్-19 నకిలీ సర్టిఫికేట్లు జారీ కాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉపక్రమించింది. ఈ మేరకు సర్టిఫికేట్ జారీ చేసే పోర్టల్ పాస్ వర్డ్‌ను మార్చేసింది. ఎక్కువ మందికి యాక్సెస్ చేసే అవకాశాన్ని కాస్తా తగ్గించింది. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే కొంత మంది అక్రమ మార్గంలో డోసులు వేసుకోకుండానే వ్యాక్సిన్ సర్టిఫికేట్ సంపాదించుకున్న వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో పని చేసే సిబ్బందితో పాటు ఈ స్కాంలో భాగస్వాములుగా ఉన్న మరికొంత మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే భవిష్యత్తులోనూ ఇలాంటివి పునరావృతమయ్యే ప్రమాదముండటంతో పోర్టల్ పాస్‌వర్డ్‌ను మార్చినట్టు తెలుస్తున్నది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో విధులు నిర్వహించిన వారిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీకి చెందిన సిబ్బందికి కూడా పాస్ వర్డ్ తెలిసేది. సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం కొంత మందికి పరిమితం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ దిద్దుబాటు చర్యలు ఏ మేరకు ఫలితమిస్తాయనేది చూడాలి.