Authorization
Tue April 08, 2025 10:56:11 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని మంత్రుల సముదాయంలో రాష్ట్ర ఉపాధి హామీ పథకం అడిషనల్ ప్రాజెక్టు అధికారుల అసోసియేషన్ 2022 సంవత్సరం క్యాలెండర్, డైరీలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పని దినాలు కేటాయిస్తే ఇప్పటివరకు 13 కోట్ల 38 లక్షల పని దినాలు (97.31 శాతం) కల్పించినట్టు తెలిపారు. మరో రెండు కోట్ల పని దినాలకు అనుమతి లభించిందన్నారు. కూలీలకు రూ. 2,374 కోట్లను కూలీగా చెల్లించినట్టు చెప్పారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు రూ. 1,049 కోట్లు మెటీరియల్ రూపంలో చెల్లించినట్టు మంత్రి తెలిపారు.