Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ-పాస్ వెబ్సైట్ లో వివరాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ పథకంలో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 27 నుంచి జరుగనున్నట్టు బీసీ వెల్ఫేర్ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు వివరాలను ఈ పాస్ తెలంగాణ వెబ్ సైట్ లో పొందుపరిచామని పేర్కొన్నారు. 2021లో నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో పొందు పరిచిన వివరాలు ప్రకారం ఆరో అంతస్తు, సంక్షేమభవన్, మాసాబ్ టాంక్ కార్యాలయంలో హజరు కావాలని ఆయన సూచించారు. ఈ పథకం కోసం మొత్తం 1,089మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 865మంది బీసీ కులాలకు చెందినవారు కాగా 224మంది ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులున్నారని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీ, సమయం, ఆఫీస్ అడ్రస్ వివరాలు పంపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి బీసీ యువతకు విదేశాల్లో ఉన్నతవిద్య అవకాశాలు కల్పిస్తూ 2016లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ప్రారంభించిందనీ, ఈ పథకం ద్వారా ఏటా రెండు విడతలలో 150 చొప్పున 300 మందికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందిస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.