Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
- స్కైవేల కోసం వందెకరాల స్థలం అడిగితే కేంద్రం ఇవ్వడం లేదు
- కుత్బుల్లాపూర్‌లో రూ.500 కోట్లతో పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/దుండిగల్
భవిష్యత్ అవసరాలను, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, 30 ఏండ్ల తర్వాత హైదరాబాద్ ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పక్కా ప్లాన్‌తో వేలకోట్ల రూపాయలతో డెవలప్మెంట్ పనులు చేపడుతున్నామని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎస్ఎన్డీపీ నిధులు కేటాయించామని మంత్రి చెప్పారు. సిటీలో నాలాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా వేల ఎకరాల్లో అర్బన్ ఫారెస్టులు, పార్కులు ఏర్పాటు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శుభకార్యాలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండేలా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో చెరువులు కలుషితం కాకుండా రూ.248 కోట్లతో మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పిల్లలకు, యువతకు ఉపయోగపడేలా ఆధునిక హంగులతో స్పోర్ట్స్ థీమ్ పార్కును అందుబాటులోకి తెచ్చామన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో కేంద్రం 100 ఎకరాల స్థలం ఇస్తే రూ.5 వేల కోట్లతో స్కై వేలకు కృషి చేస్తామన్నారు. కానీ, ఏడున్నరేండ్లుగా కేంద్ర మంత్రులను అడిగినా దీనిపై సమాధనం లేదన్నారు. మిలటరీ పరిధిలో లేని సుచిత్ర వద్ద త్వరలోనే ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు సురభీ వాణిదేవి, శంభీపూర్‌రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, జాయింట్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, జోనల్ కమిషనర్ మమత తదితరులు పాల్గొన్నారు.