Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టును పట్టని పాలకులు
- ఇక్కడి రైతులకు 30 ఏండ్లుగా తప్పని ఎదురుచూపులు
- ఎన్నికల వేళ.. ఇక్కడే కూర్చొని పూర్తి చేస్తానని సీఎం హామీ
నవతెలంగాణ-మద్నూర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు.. ప్రత్యేక రాష్ట్రంలోనూ పట్టాలెక్కట్లేదు. రాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నికల ప్రచార వేళ.. 'ఇక్కడే కూర్చుండి ప్రాజెక్టు పూర్తి చేస్తా'నని హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా.. ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 49 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లాలోని మారుమూల మద్నూర్, బిచ్కుంద మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి రైతాంగానికి సైతం సాగునీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కామారెడ్డి జిల్లాలోని మారుమూల మద్నూర్, బిచ్కుంద మండలాల్లో సాగునీటి కోసం, అటు మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాంతాలకు కలిసి అంతర్ రాష్ట్ర లెండి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు ప్రభుత్వాలు 1985-86లో ఒప్పందాలు చేసుకున్నాయి. 2007లోగా ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాలని లక్ష్యంగా ముందుకెళ్లాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా గోనేగావ్ గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టారు. నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ వాటా 62 శాతం కాగా, గత ఉమ్మడి రాష్ట్ర వాటా 38 శాతంగా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 8.65 టీఎంసీలు కాగా మహారాష్ట్ర నీటి వాటా 3.93 టీఎంసీలు, రాష్ట్ర నీటి వాటా 2.43 టీఎంసీలుగా నిర్ధారించుకున్నాయి. నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు, కాలువల కోసం మరో రూ.45 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. తర్వాత ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది. దాంతో రూ.245 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
ప్రత్యేక రాష్ట్రంలోనైనా..
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రాజెక్టు పూర్తవుతుందని ఇక్కడి రైతులు భావించారు. ఎన్నికల్లో సైతం.. అధికారంలోకి వస్తే ఇక్కడే కుర్చీ వేసుకూర్చోని లెండి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండు పర్యాయాలుగా ముఖ్యమంత్రి అయినా.. కనీసం ప్రాజెక్టు పేరును సైతం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
తక్కువ ధరకే భూములు స్వాధీనం
లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగితే మరో 5 వేల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇక్కడి రైతులు తమ భూములను తక్కువ ధరకే ప్రాజెక్టు కోసం ఇచ్చేసారు. రూ.80 వేలకు చొప్పున కొనుగోలు చేసిన భూమి విలువ ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40 లక్షలు పలుకుతుండటం గమనార్హం.
గతంలో మహారాష్ట్ర సర్కార్‌తో మంతనాలు
హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమ యంలో మహారాష్ట్రకు వెళ్లి రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు చేసుకొని ఒప్పందాలు కుదు ర్చుకున్నారు. లెండి ప్రాజెక్టుకు రాష్ట్ర వాటాగా మరో 200 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. ఒప్పందాలు పూర్తయి రాష్ట్రానికి వచ్చిన హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలి కారు. కానీ పనులు మాత్రం ముందుకు నడవట్లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రాష్ట్ర వాటా చెల్లించి పనులు జరిగే విధంగా కృషి చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.