Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ బ్రాండ్ల పేరుతో పెరుగు, పాలు, పన్నీర్ తయారీ
- పాశం మైలారం పారిశ్రామికవాడలో తయారీ కేంద్రం గుట్టురట్టు
- వివరాలు వెల్లడించిన పటాన్ చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి
నవతెలంగాణ - పటాన్చెరు
ప్రజల ప్రాణాలతో పాల ఉత్పత్తి కేంద్రాలు చెలగాటమాడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో అక్రమంగా నిర్వహిస్తున్న కల్లీ పాల సెంటర్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా వివిధ బ్రాండ్లతో కల్తీ రసాయనాలు కలిపి పాలు, పెరుగుతో పాటు వివిధ రకాల పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న ఓ పరిశ్రమపై పటాన్చెరు పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని పవిత్ర డెయిరీ ప్రయివేటు లిమిటెడ్‌ను జూబ్లీహిల్స్‌కు చెందిన వెంకటేశ్వరరావుకు లీజుకిచ్చారు. గత కొద్ది రోజుల నుంచి ఆ పరిశ్రమలో.. పాల ఉత్పత్తుల మాటున అమూల్, హెరిటేజ్, ఎన్ఎస్ఆర్, గోవర్ధన్, గాయత్రి, వీఎన్ఆర్, విశాఖ వంటి పలు బ్రాండ్ల పేరుతో కల్తీ పాలు, పెరుగు, పన్నీర్.. వంటి పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. విశాఖ మిల్క్‌కు చెందిన పాల ఉత్పత్తుల కేంద్రాన్ని పాశమైలారం పారిశ్రామిక వాడలో కొంతకాలం కిందట పీసీబీ అధికారులు వివిధ కారణాలతో సీజ్ చేయగా ఆ సంస్థకు చెందిన పాల ఉత్పత్తులు సైతం ఈ కేంద్రంలో తయారవటం గమనార్హం. ఈ తనిఖీల్లో సుమారు 6 వేల లీటర్ల పాలతో పాటు పన్నీర్, పెరుగు ఉత్పత్తులను పోలీసులు సీజ్ చేశారు. అలాగే పవిత్ర మిల్క్ డెయిరీ మేనేజర్ ప్రసాద్ రావు, విశాఖ మిల్క్ సూపర్ వైజర్ పరమేశ్వర్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు వీరిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి విచారణ చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో పటాన్చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అనురాధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.