Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆర్మూర్‌టౌన్/నిజామాబాద్‌సిటీ
పలు ప్రారంభోత్సవాలకు వెళ్తున్న ఎంపీ అరవింద్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బాండ్ పేపర్ ఎంపీ.. పసుపు బోర్డు ఎక్కడా..? పసుపు బోర్డు తెస్తావా.. రాజీనామా చేస్తావా అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. దాంతో బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సన్నపల్లిలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు నందిపేట్ వెళ్తున్న ఎంపీ అరవింద్‌ను ఆర్మూర్ మండలం ఇస్సన్నపల్లిలో టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఫేక్ ఎంపీవని, రైతులను మోసం చేసిన తనను ఏ గ్రామంలోనూ తిరగనివ్వబోమని నినాదాలు చేశారు.
మామిడిపల్లి చౌరస్తా వద్ద ధర్నా
కోవిడ్ నిబంధనల పేరుతో బీజేపీ నాయకులు, ఎంపీని అరెస్ట్ చేస్తున్నారనీ, టీఆర్ఎస్ నాయకులకు నిబంధనలు వర్తించవా అని ఎంపీ అరవింద్ ప్రశ్నిం చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. నందిపేట్ మండలం అన్నారం, చిన్న యారం, దాతాపూర్ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలు, పరిశీలన కోసం వెళ్తున్నానని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్టు ఎంపీ తెలిపారు. ఆలూర్ గ్రామం నుంచి ఇస్సపల్లి (వి)కి వెళుతుండగా దాదాపు 200 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుమిగూడిన విషయాన్ని కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్మూర్ ఏసీపీ దృష్టికి తీసుకెళ్లినా గుంపును క్లియర్ చేయలేదని, పైగా గుంపును తొలగించే వరకు వేచి ఉండమని పోలీసులు తెలిపారని చెప్పారు. పోలీసుల సూచనల మేరకు వేచి ఉండగా, అక్కడకు టీఆర్ఎస్ గూండాలు హఠాత్తుగా వచ్చి తనతో పాటు తన సహచరులపైనా రాళ్లు రువ్వడంతో తన కారుతో పాటు ఇతర కార్లు ధ్వంసమైనట్టు తెలిపారు. తాను ఎంచుకున్న రూట్లో కాకుండా వేరే దారిలో వెళ్లాలని తప్పుదారి పట్టించిన పోలీసులు, ఇస్సపల్లి గ్రామం వద్ద ఆగేలా చేసి టీఆర్ఎస్ పార్టీ గూండాలు తనపై దాడి చేసేలా పోలీసులే స్వయంగా స్కోప్ ఇచ్చారని ఆరోపించారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ఏసీపీ రఘు అక్కడకు చేరుకుని వారిని సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు.
హత్యాయత్నం చేశారని సీపీకి ఎంపీ ఫిర్యాదు
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు మున్నా, మున్సిపల్ వైస్ చైర్మెన్ సంతోష్, ఆర్మూర్ ఎంపీపీ పసుపు నర్సయ్య, పూజ నరేందర్, కార్తీక్ రెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు తనపై హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కుట్ర పన్నారని ఎంపీ అరవింద్ అరోపించారు. తన పర్యటనను అడ్డుకొని దాడి చేసిన, చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ అరవింద్ సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేశారు.