Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి నిరుద్యోగులు బలి
- కరోనాతో పలువురికి కరువైన ఉపాధి
- రాష్ట్రవ్యాప్తంగా 50 మంది వరకు ప్రాణార్పణం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'కేసీఆర్ ఇక ఉద్యోగాలివ్వడు.. నోటిఫికేషన్లు వెలువడవు... ఉద్యోగం లేకుండా నేను బతికే పరిస్థితి లేదు.. పిచ్చిలేస్తోంది.. నా చావుకు కరోనా.. సీఎం కేసీఆరే కారణం..' అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని మరీ మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఖమ్మంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది జులై 15వ తేదీన జిల్లాలోని పెనుబల్లి మండలం గంగాదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు కూడా నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా ప్రజలు ఆ ఘటన మరువకముందే మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
రాష్ట్రవ్యాప్తంగా అంతులేని విషాదాలు..
రాష్ట్రప్రభుత్వం గతేడాది జులైలో వివిధ శాఖల్లో 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నిర్ధారించింది. ఇప్పటికీ ఏడునెలలైనా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన రాష్ట్రంలో ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీనికి కరోనా కూడా తోడవడంతో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతిని లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారు. ఫలితంగా వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 మంది వరకు ఏడాది కాలంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంలో అక్కడి హిల్ కాలనీకి చెందిన ప్రయివేట్ టీచర్ దంపతులు వనం రవికుమార్, అక్కమ్మ బలవన్మరణాలు సంచలనం కలిగించాయి. దానికి కొద్దిరోజుల తర్వాత వనపర్తి జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు కొండల్ ఉద్యోగం రాలేదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా సుమారు రెండేండ్ల్లలో 50 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మ హత్యకు పాల్పడ్డారు. వీరిలో అత్యధికం సుమారు 35 మందికి పైగా ప్రయివేటు స్కూల్ టీచర్సే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఉన్న ప్రయివేటు టీచర్లకు కంటితుడుపుగా నెలకు రూ.2,000 నగదు, 25 కేజీల బియ్యం ఇచ్చింది. ఇది కూడా మూడు నెలల పాటు కొనసాగి నిలిచిపోయింది.
లక్షల్లో ఖాళీలుంటే వేలల్లో భర్తీ..
రాష్ట్రంలో 3.50 లక్షల ఉద్యోగాలు తక్షణం భర్తీ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాస్ కమిటీ చెప్పింది. ఈ కమిటీ వేసినప్పటి నుంచి ఒక్క పోస్టు కూడా నింపలేదు. రాష్ట్రం వచ్చాక 1.34 లక్షల పోస్టులిచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఏడేండ్లలో సుమారు 30వేల పోస్టులు మాత్రమే ఇచ్చింది. గత జులైలో ఆర్థికశాఖ రాష్ట్ర మంత్రి మండలికి సమర్పించిన లెక్కల ప్రకారం 56,979 ఉద్యోగాల భర్తీకి మాత్రమే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వశాఖల్లో 44,022 మంది, ఆయా శాఖల పరిధిలోని గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర సంస్థల్లో 12,957 మంది కలిపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ (డీఆర్)కు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా పోలీసుశాఖలో 21,507 పోస్టులు ఖాళీ ఉండగా అతి తక్కువగా సమాచారశాఖలో కేవలం నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇలా మొత్తం 28శాఖల వివరాలను కేబినెట్‌కు సమర్పించగా 8 శాఖల్లో వంద కన్నా తక్కువ ఉద్యోగ ఖాళీలు చూపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 18వేల పోస్టులను మాత్రం చూపించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమాచారశాఖలోనే పది పోస్టులు ఖాళీ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోస్టులు ఖాళీ చూపించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలచ్చాయి. పోలీసు శాఖలో ఖాళీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్సీసీ క్యాడెట్ సర్టిఫికెట్ కూడా ఉన్న ముత్యాల సాగర్ దానిపై ఫోకస్ పెట్టి స్థానికంగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఆయన తరహాలోనే నగరంలో ఉన్న నాలుగైదు కోచింగ్ సెంటర్లలో వందల సంఖ్యలో నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. వారిలోనూ నైరాశ్యం అలుముకోకముందే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే.. : నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ మాయ మాటలు వినీవినీ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగుల విభజనను సక్రమంగా చేపట్టి తక్షణం ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేయాలి. గత ఏడేండ్లలో ప్రభుత్వం 30వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగమన్న ప్రభుత్వం ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత వదిలేస్తోంది.