Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూస్వాములను ఎదురించి ఉద్యమాలవైపు
తీగల సాగర్ ప్రస్థానం...
విద్యార్థి, యువజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల్లో కీలకంగా పనిచేసిన తీగల సాగర్... ఆ తర్వాత రైతు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నారాయణపేట జిల్లా, మండలంలోని కోటకొండ గ్రామంలో జన్మించారు. ఎనిమిదోతరగతి చదువుతున్న సమయంలో గ్రామ భూస్వామిని ఎదిరించాడు. పదోతరగతిలో మూఢనమ్మకాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డాడు. భగత్‌సింగ్ యువజన సంఘాన్ని స్థాపించారు. భూస్వామి బనాయించిన అక్రమ కేసులతో ఇంటర్‌లోనే జైలుకు వెళ్లాడు. 1997లో ఎల్ఎల్బీ చదివేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచే ఎస్ఎఫ్ఐలో చురుగ్గా పాల్గొన్నారు. 1997 నుంచి 2005 వరకు ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు, ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రైతుసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017నుంచి రైతు సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విద్యార్థి దశ నుంచే ఉద్యమాలవైపు
ఎండీ అబ్బాస్
జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జీ) గ్రామంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. వారి తాత నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలు వదిలారు. 1999లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో పీజీ పూర్తిచేశారు. అదే ఏడాది జులైలో పార్టీ పూర్తికాల కార్యకర్తగా వచ్చారు. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లోని బషిర్‌బాగ్ కాల్పుల ఘటనలో లాఠీదెబ్బలు తిని అరెస్టయి జైలుకూ వెళ్లారు. 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండ నేపథ్యంలో ఏర్పాటైన అవాజ్ సంస్థకు మొదటి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ముస్లిం రిజర్వేషన్ల సాధన పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకుడిగా కొనసాగిన సుదీర్ఘ మహాజనపాదయాత్ర బృందంలో భాగస్వామి అయ్యారు.
విలేకరి నుంచి విప్లవ ప్రయాణం...
పాలడుగు భాస్కర్
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రంలో వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించారు. మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఖమ్మంలోని సిద్దారెడ్డి కళాశాలలో డిగ్రీ చదివారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే 1995 నుంచి 1997 వరకు ప్రజాశక్తి దినపత్రికలో గార్ల విలేకరిగా పనిచేశారు. 1998లో ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చి సీఐటీయూ బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం కేవీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో గార్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికై వైస్‌చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.
పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు నేతృత్వంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌యాత్రలో పాల్గొన్నారు. 2003లో మహబూబ్‌నగర్‌లో జరిగిన సీఐటీయూ రాష్ట్ర మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్మికగర్జన పాదయాత్రలో 400 కిలోమీటర్లు నడిచారు. 2014లో సీపీఐ(ఎం) ప్రథమ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ మూడో మహాసభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అంకితభావంతో పార్టీ కోసమే..
మల్లు లక్ష్మి
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల్లో ఆమె ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా నూతనంగా ఎన్నికయ్యారు. 1996లో ఐద్వా సభ్యత్వం, 2002లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నల్లగొండ పట్టణ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు. సూర్యాపేట మండలంలో రాయిన్‌గూడెం సర్పంచ్‌గా 2006లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2011లో ఐద్వా నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, 2015లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2018లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.