Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ సున్నం రాజయ్యనగర్
నుంచి గుడిగ రఘు
రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల ప్రాతిపదికగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి పోరాటాన్నీ పల్లెల నుంచే ప్రారంభించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో సామాజిక, సాంస్కృతిక శక్తులతో కలిసి పని చేయాలని సూచించారు. బలమైన పోరాటాల ద్వారా పొలిటికల్ ఫ్రంట్ రూపాంతరం చెందుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్, కుంజా బొజ్జి, మస్కు నర్సింహ ప్రాంగణం...)లో మూడు రోజులపాటు కొనసాగిన సీపీఐ (ఎం) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రతినిధులు లేెవనెత్తిన చర్చలకు తమ్మినేని సమాధానమిచ్చారు. సమస్యల సాధన కోసం వేదికలు ఏర్పాటు చేయాలనీ, వాటికి పరిష్కారం దొరికేదాకా దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తులుంటాయనే అంశంపై ఇప్పుడు చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. భూ పోరాటాలు, పోడు భూములు, తాగు, సాగు నీరు, నిరుద్యోగం, జీవో 317 వంటి సమస్యలపై ఐక్య పోరాటాలు నిర్వహించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకోసం గ్రామస్థాయి నాయకులు మరింత పట్టుదలతో పనిచేయాలని సూచించారు. ప్రజల అజెండాపై పోరాటాల ఆధారంగానే ఎన్నికల పోరాటాలకు రూపకల్పన జరుగుతుందని తెలిపారు. భూమి, కూలి, కార్మిక, మధ్యతరగతి రంగాల్లో నెలకొన్న సామాజిక, సాంస్కృతిక అంశాలను తీసుకుని పోరాటాలకు శ్రీకారం చుట్టాలన్నారు. రాజకీయాల్లో సున్నితమైన అంశాలు ముందుకొచ్చినప్పుడు పార్టీని కొన్ని శక్తులు గందరగోళ పరుస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే సమయంలో భూస్వామ్య రాజకీయ విధానాలను ఎండగట్టేందుకు క్షేత్రస్థాయి నాయకులు సంసిద్ధులు కావాలని సూచించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యవసర ధరల పెరుగుదల, ధరణి, కులవివక్ష, అణచివేత, మహిళలపై లైంగికదాడులతోపాటు స్థానిక సమస్యలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. అప్పుడు తమకోసం సీపీఐ (ఎం) ఏం చేస్తున్నదనే విషయం స్థానిక ప్రజలకు అర్థమవుతుందన్నారు. అప్పుడే క్షేత్రస్థాయిలో కదలిక వస్తుందని తమ్మినేని తెలిపారు.