Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిని పెంచుకోవాలి
- వర్గ, సామాజిక పోరాటాలను బలపరచాలి
- బీజేపీని ఒంటరిపాటు చేయడం, ఓడించడమే లక్ష్యం
- టీఆర్ఎస్ విధానాలపై మెతకవైఖరి వద్దు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్
- టీఆర్ఎస్ విధానాలపై మెతకవైఖరి వద్దు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్
సున్నం రాజయ్య నగర్ (తుర్కయంజాల్)
నుంచి బొల్లె జగదీశ్వర్
వామపక్ష, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటు తక్షణ అవసరమనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్ అన్నారు. ఆ కూటమి ఎన్నికలప్పుడే పనిచేయడం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల్లో మంగళవారం ప్రతిని ధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్‌లో ఏప్రిల్ ఆరు నుంచి పదో తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. బెంగాల్, త్రిపురలో పార్టీపైనా, కార్యకర్తలపైనా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేనెల మొదటివారంలో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్రకమిటీ ఆమోదించి విడుదల చేస్తుందన్నారు. రెండేండ్లుగా కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా, సామాజికంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పార్టీ ప్రజలకు అండగా నిలబడిందనీ, ఆర్థిక సహాయం చేయడం, ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేపీని ఒంటరిపాటు చేయడం, ఎన్నికల్లో ఓడించడే ప్రధాన లక్ష్యమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆధీనంలో బీజేపీ పనిచేస్తున్నదని, హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నదని విమర్శించారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ బూర్జువా, భూస్వామ్య పార్టీలేనని అన్నారు. అయితే బీజేపీలాగా కాంగ్రెస్‌ను ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు శాసించడం లేదన్నారు. అయితే ఆ రెండు పార్టీలూ నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తాయని వివరించారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో బీజేపీ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్‌తో ఎలాంటి రాజకీయ అవగాహన, పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నింటినీ కూడగట్టాలనీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఐక్యం చేయాలని చెప్పారు.
బీజేపీ మతోన్మాద, ఆర్థిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మెతకవైఖరి అవసరం లేదనీ, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని చెప్పారు. సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అప్పుడే ప్రజలను, కొత్త శక్తులను ఆకర్షించగలమన్నారు. ప్రజాపునాదిని పెంచు కుంటూ, వామపక్షాలను బలోపేతం చేస్తూ, వర్గ, ప్రజా, సామాజిక పోరాటాలను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతాంగ పోరాట పటిమను చూసి వివిధ రాజకీయ పార్టీలు మద్దతిచ్చే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం) బలమైన శక్తిగా ఎదుగుతుందనీ, ప్రజల్లోకి విస్తరిస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణకు ఉన్న వారసత్వ సంప్రదాయాలను కొనసాగించాలని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోడు రైతుల సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఇతర ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు.