Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదంపై రణభేరి మోగించాల్సిందే..
- ఉదారవాద విధానాలపై బాణం ఎక్కుపెట్టాల్సిందే...
- జనంతో మమేకం.. ప్రజా పోరాటాలకు ఊతం...
- సీపీఐ(ఎం) దిశా నిర్దేశం
- స్ఫూర్తిదాయకంగా ముగిసిన మహాసభ
సున్నం రాజయ్య నగర్ (తుర్కయంజాల్)
నుంచి బి.వి.యన్. పద్మరాజు
'తగ్గేదేలె...' ఇటీవల వచ్చిన ఓ హిట్ సినిమాలోని డైలాగ్ ఇది. ఇదే తరహాలో పేదోళ్ల ఎర్రజెండా పార్టీ సీపీఐ(ఎం)... దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై పోరుకు 'తగ్గేదేలే...' అంటూ ప్రతినబూనింది. వాటి అంతు చూస్తానంటూ హెచ్చరించింది. ఆరెస్సెస్ కనుసన్నల్లో కొనసాగుతున్న బీజేపీ మతోన్మాద చర్యలపై సమరశంఖాన్ని పూరించింది. ఇదే సమయంలో జాతీయ బూర్జువా పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను పదునైన పోరాటాల బాణంతో గురి చూసి కొట్టాలని పిలుపునిచ్చింది. జనంతో మమేకం కావటం ద్వారా ప్రజా ఉద్యమాలకు పదును పెట్టాలని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (కామ్రేడ్ సున్నం రాజయ్య నగర్, కుంజా బొజ్జి, మస్కు నర్సింహ ప్రాంగణం) వేదికగా నిర్వహించిన మూడో మహాసభ సాక్షిగా నిర్ణయించింది. ఇందుకనుగుణంగా జిల్లాలు, రంగాల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి ఐక్య పోరాటాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేసింది.
ఈ నెల 22న ఆన్లైన్ బహిరంగ సభ ద్వారా ప్రారంభమైన ఈ మహాసభ... మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి ఎన్నికతో పరిపూర్ణమైంది. 23న సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించటంతో ప్రతినిధుల సభ లాంఛనంగా ప్రారంభమైంది. అనంతరం అమరవీరులకు నివాళులర్పించిన ప్రతినిధులు, వారి త్యాగాలను స్మరించుకుంటూ సభలోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆన్లైన్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభోపన్యాసం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సౌహార్ద్ర సందేశమిచ్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా చర్చలను ప్రారంభించారు. గత మూడేండ్ల కాలంలో ఆయా జిల్లాల్లో నిర్వహించిన ఉద్యమాలను నెమరు వేసుకున్నారు. రెండో రోజైన సోమవారం వివిధ అంశాలపై మొత్తం 54 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా వామపక్ష, ప్రజాతంత్ర, సామాజికశక్తుల ఐక్య సంఘటన ఏర్పాటుదిశగా అడుగులు వేయాలని మహాసభ నిర్ణయించింది. చివరి రోజైన మంగళవారం... ప్రతినిధులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సమాధానాలిచ్చారు. మహాసభలు మన ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలో వివరించారు. అఖిల భారత స్థాయిలో ప్రజా సమస్యలపైన, ఎన్నికల సందర్భాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని, ఎత్తుగడలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ సోదాహరణంగా వివరించారు. కార్యకర్తలు, నాయకులు వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతికంగా, రాజకీయంగా అవగాహన చేసుకోవాల్సిన అంశాలను, ఆవశ్యకతను క్షుణ్నంగా విశదీకరించారు. మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు... ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎలా పని చేయాలి..? ఆ సందర్భంగా ఆకళింపు చేసుకోవాల్సిన అంశాలేమిటి...? వాటిని ఏయే సందర్భాల్లో ఎలా పరిశీలించాలనే విషయాలను వివరించారు.
అనంతరం ప్రతినిధుల కరతాళ ధ్వనులు, విప్లవాభినందనాల నడుమ నూతన రాష్ట్ర కమిటీని, రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవటంతో మహాసభ దిగ్విజయంగా ముగిసింది. వివిధ ప్రజా సమస్యలపై పార్టీ, మహాసభ ఇచ్చిన కర్తవ్యాలను భుజాన వేసుకుని కార్యకర్తలు, నాయకులు కర్తవ్య దీక్షతో తమ తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.